ఉపాధ్యాయులకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి

Jul 14 2025 4:39 AM | Updated on Jul 14 2025 4:39 AM

ఉపాధ్

ఉపాధ్యాయులకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయులకు పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని పీఆర్‌టీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. కాకినాడలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతా ప్రదీప్‌ కుమార్‌, బండి నూకరాజు మాట్లాడారు. ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న 3 డీఏలు తక్షణం మంజూరు చేయాలని, 2023 జూలై నుంచి 12వ పీఆర్‌సీ అమలు చేయాలని, పీఆర్‌సీని నియమించి, 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ శ్రీనివాస్‌, కన్వీనర్‌ వాకాడ వెంకట రమణ, కృష్ణకుమార్‌, మనోహర్‌, మంగారావు త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలకు పాతర

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయులపై పని భారం పెంచి, విద్యా ప్రమాణాలకు కూటమి ప్రభుత్వం పాతర వేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి విమర్శించారు. కాకినాడలో ఆదివారం నిర్వహించిన ఎస్‌టీయూ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి విద్యా రంగానికి తీరని నష్టం చేస్తున్నారని, తరగతి గదిలో ప్రశాంతంగా పాఠం చెప్పే పరిస్థితి నేడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే గిన్నిస్‌ బుక్‌ రికార్డుల కోసం యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాల ఆన్‌లైన్‌ ఉపాధ్యాయులే చేయాలన్నది ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. మొబైల్‌ ఫ్రీ క్లాస్‌ రూం విధానాన్ని అమలులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల

ఏలేశ్వరం: ఖరీఫ్‌ సాగుకు ఏలేరు రిజర్వాయర్‌ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.

దారులన్నీ తలుపులమ్మ సన్నిధానానికే..

తుని రూరల్‌: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆషాఢ మాసం మూడో ఆదివారం.. అమ్మవారిని విశేషంగా ఆరు టన్నుల కూరగాయలతో శాకంబరిగా అలంకరించడంతో భక్తులు తండోపతండాలుగా లోవ దేవస్థానానికి తరలివచ్చారు. తీవ్రమైన రద్దీతో 16వ నంబరు జాతీయ రహదారి నుంచి లోవ ఆర్చి గేటు వరకూ పలుమార్లు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సాయంత్రం ఆరు గంటలకు కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో రావడంతో తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినా మందుబాబుల ఆగడాలు.. వాహనాలు నిలిపివేయడంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో కొంతమంది భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించి, కనిపించిన ప్రతి చెట్టుకూ ఉపారాలు సమర్పించారు. లక్ష మంది వరకూ భక్తులు రాగా క్యూలైన్ల ద్వారా ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారిని 50 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.5,51,700, పూజా టికెట్లకు రూ.6,92,720, కేశఖండన శాలకు రూ.62,500, వాహన పూజలకు రూ.3,340, వసతి గదుల అద్దెలు రూ.1,09,892, విరాళాలు రూ.2,83,244 కలిపి మొత్తం రూ.17,03,396 ఆదాయం లభించిందని వివరించారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. రూరల్‌ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

13టియుఎన్‌105 : లోవ క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు

ఉపాధ్యాయులకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి 1
1/1

ఉపాధ్యాయులకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement