నకిలీలలు | - | Sakshi
Sakshi News home page

నకిలీలలు

Jul 18 2025 5:30 AM | Updated on Jul 18 2025 5:30 AM

నకిలీ

నకిలీలలు

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో శానిటేషన్‌ కాంట్రాక్టర్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) నకిలీ రసీదుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా మూడు నెలల పాటు పీఎఫ్‌ చెల్లిస్తున్నట్లు రూ.30 లక్షలకు నకిలీ రశీదులు సృష్టించి, నెలకు రూ.59 లక్షల చొప్పున కాంట్రాక్టర్‌ రూ.1.77 కోట్లకు శానిటేషన్‌ బిల్లు చేయించుకున్నా.. ఏ స్థాయిలోనూ అధికారులు కనిపెట్టలేకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా.. అవగాహనా లోపమా.. లేక లాలూచీ వ్యవహారమా అనేది అర్థం కావడం లేదు. ఈ నకి‘లీలల’పై ‘అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్‌ మోసం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రిక గురువారం ప్రచురించిన వార్తకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

టెండర్‌ పిలవకుండా..

సాధారణంగా దేవస్థానాల్లో ఏ పనికై నా టెండర్‌ పిలవడమో లేక నాలుగైదు సంస్థల నుంచి కొటేషన్లు స్వీకరించి వాటిలో తక్కువకు కోట్‌ చేసిన సంస్థకు కాంట్రాక్ట్‌ అప్పగిస్తారు. అయితే, అన్నవరం దేవస్థానంలో శానిటేషన్‌ టెండర్‌ను మాత్రం విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌కు అప్పగించాలని దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌కు ఈఓ వీర్ల సుబ్బారావు నివేదిక పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు. 350 మంది శానిటేషన్‌ సిబ్బందిని దేవస్థానంలో వివిధ చోట్ల నియమించి, వారికి ప్రతి నెలా 25 శాతం పీఎఫ్‌తో కలిపి నెలకు రూ.59 లక్షల బిల్లు చెల్లించేలా, నెలకు రూ.12 లక్షల శానిటరీ మెటీరియల్‌ను దేవస్థానం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా దేవస్థానంలో చిన్న కాంట్రాక్ట్‌ అప్పగించినా అంచనా మొత్తంలో దాదాపు 15 శాతం డిపాజిట్‌గా జమ చేయాల్సి ఉంటుంది. కానీ, కనకదుర్గా మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌ నుంచి ఒక్క రూపాయి కూడా డిపాజిట్‌ రూపంలో తీసుకోకుండా ఈ బాధ్యతలు అప్పగించడం విచిత్రం. అప్పట్లోనే దీనిపై విమర్శలు రాగా, ఒక నెల తాత్కాలిక అడ్జస్ట్‌మెంట్‌ అని, ఏప్రిల్‌లో కొత్త కాంట్రాక్టర్‌ వస్తారని అధికారులు సమాధానం చెప్పారు.

అధికారుల నిర్లక్ష్యమే అలుసుగా..

దేవస్థానం అధికారుల నిర్లక్ష్యాన్ని అలుసుగా తీసుకున్న కనకదుర్గా మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌ నిర్వాహకులు నకిలీ పీఎఫ్‌ చలానాలు సృష్టించారు. వరుసగా మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు రూ.10.09 లక్షలు, రూ.10.64 లక్షలు, రూ.10.45 లక్షలకు చలానాలు సృష్టించి దేవస్థానానికి జమ చేసి, బిల్లు చేయించుకున్నారు. మొత్తం 350 మంది సిబ్బంది జీతాలకు నెలకు రూ.59 లక్షల చొప్పున మూడు నెలలకు కలిపి దేవస్థానం రూ.1.77 కోట్ల మేర బిల్లులు చెల్లించింది. అయితే, తమ ఖాతాలకు పీఎఫ్‌ మొత్తం జమ కాకపోవడంపై శానిటేషన్‌ సిబ్బంది ఆరా తీశారు. దీంతో, అనుమానం వచ్చిన దేవస్థానం అధికారులు.. సంబంధిత కాంట్రాక్టర్‌ను నిలదీశారు. విధి లేని పరిస్థితిలో ఆ కాంట్రాక్టర్‌ మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి ఈ నెల 9, 14, 15 తేదీల్లో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షల చొప్పున పీఎఫ్‌కు చెల్లించి, ఆ రశీదులు గత మంగళవారం జమ చేశారు. దీంతో పాత రశీదులు ఫేక్‌ అని ఆ కాంట్రాక్టరే స్వయంగా అంగీకరించనట్లయింది. అయితే, ఆ పాత రశీదుల క్యూఆర్‌ కోడ్‌లు స్కాన్‌ చేయగా.. అవి గతంలో వేరే సంస్థ తరఫున చెల్లించిన పీఎఫ్‌ చలానాలని, వాటి తేదీలు, మొత్తం, టీఆర్‌ నంబర్‌ మార్ఫింగ్‌ చేశారని తేలింది. ఆ కాంట్రాక్టర్‌ మూడు నెలలకు పీఎఫ్‌ తిరిగి చెల్లించి, రశీదులు ఇవ్వడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ అలా చెల్లించకపోయినా దేవస్థానం చేసేదేమీ లేదు. ఆ కాంట్రాక్టర్‌ దేవస్థానం వద్ద ఒక్క రూపాయి కూడా డిపాజిట్‌ చేయకపోవడమే దీనికి కారణం.

ఆ రసీదు కూడా నకిలీయేనా !

ఇంత జరిగినా గత నెలకు కూడా పీఎఫ్‌ రసీదు నకిలీదే జమ చేశారు. దానిని ఈ నెల 12న జీతాల బిల్లుతో పాటు దేవస్థానానికి పంపించారు. కాంట్రాక్టర్‌ ఇచ్చిన రసీదులోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే వచ్చిన సమాచారానికి అసలు పొంతనే లేదు. టీఆర్‌ నంబర్‌, నెల కూడా తేడాగా ఉన్నాయి. దీంతో ఇది కూడా నకిలీ అనే భావిస్తున్నారు. శానిటేషన్‌ కాంట్రాక్టర్‌ నిర్వాకాలపై గతంలో ‘సాక్షి’ అనేక కథనాలు ప్రచురించింది. ఏప్రిల్‌ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు?’ శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందించి మార్చి నెల జీతాలు చెల్లించారు. అలాగే, ఏప్రిల్‌ జీతాల చెల్లించకపోవడంతో ‘వీరి కష్టం తుడిచేవారేరి’ శీర్షికన మే 26న కథనం ప్రచురించగా జూన్‌ 3న చెల్లించారు. మే నెల జీతాలివ్వకపోవడంతో ‘వేతనాల ఆలస్యం రివాజే’ శీర్షికన జూన్‌ 19న వార్త ప్రచురించాక చెల్లించారు. జూన్‌ నెల జీతాలు ఇంకా చెల్లించనేలేదు. వేతనాల చెల్లింపు ఆలస్యమైతే పీఎఫ్‌పై పెద్దగా దృష్టి ఉండదని, అందువల్ల నకిలీ చలానాలు జమ చేసినా పట్టించుకోరనే అభిప్రాయంతోనే ఆవిధంగా చేస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

పీఎఫ్‌ రసీదులు పరిశీలిస్తున్నాం

కాంట్రాక్టర్‌ అందజేసిన పీఎఫ్‌ రసీదులను వెరిఫై చేయిస్తున్నాం. అదే విధంగా ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌, లేబర్‌ కమిషనర్‌ కార్యాలయ సిబ్బందిని పంపించాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరాం. వారు కూడా ఆ రశీదులు పరిశీలిస్తారు. ఒకవేళ ఆ రసీదులు నకిలీవని తేలితే ఆ కాంట్రాక్టర్‌ను విధుల నుంచి తప్పించే విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయిస్తాం. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.

– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం

శానిటేషన్‌ కాంట్రాక్టర్‌ చీటింగ్‌తో

రత్నగిరిపై ప్రకంపనలు

‘సాక్షి’ కథనంతో బయటపడుతున్న

టెండర్‌ లొసుగులు

వివరణ కోరిన దేవదాయ మంత్రి

నకిలీలలు1
1/3

నకిలీలలు

నకిలీలలు2
2/3

నకిలీలలు

నకిలీలలు3
3/3

నకిలీలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement