
పెత్తందార్ల కోసమే చంద్రబాబు పాలన
● పేదల కోసం కాదు
● ఆయన నిర్లక్ష్యంతోనే
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు
● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
తొండంగి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలన పేదల కోసం కాదని, ‘పచ్చ’ మీడియాతో పాటు వందిమాగధులు, పెత్తందార్ల అభివృద్ధి కోసమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంపై తొండంగిలో గురువారం జరిగిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారని, పేదలకు నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, పేదలకు అందించారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు కేవలం ఏడాది కాలంలోనే దాదాపు రూ.1.72 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్‌తో పాటు 143 వరకూ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను 50 శాతం మేర జగన్ పూర్తి చేశారని దాడిశెట్టి రాజా చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు 45.75 మీటర్లకు నిర్మాణ పనులు జరగ్గా.. చంద్రబాబు కేంద్రం వద్ద మాట్లాడకపోవడంతో దీనిని 41.15 మీటర్లకు తగ్గించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గడం వల్ల లక్షలాది మంది ఆయకట్టు రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.15 వేల కోట్లు అధికంగా తెస్తే ప్రాజెక్టును పూర్తి స్థాయి ఎత్తులో నిర్మించవచ్చని వివరించారు. కేంద్రానికి టీడీపీ ఎంపీల మద్దతు అవసరం ఉన్నందున దీనిపై ఒత్తిడి తేవాలని రాజా డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి కాకపోతే బనకచర్ల ప్రాజెక్టు కట్టినా ఉపయోగం లేదన్నారు. ఎక్కడో బిహార్‌లో ఎన్నికలు జరుగుతూంటే కేంద్రం లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తోందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చంద్రబాబు కమీషన్ల కోసం మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అనుభవంతో కేంద్రానికి తలవంచకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోలవరం ప్రాజెక్టు విషయంలోను, ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని రాజా సూచించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు, పార్టీ పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొయ్యా మురళి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ మేరుగు పద్మలత, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పురుషోత్తం గంగాభవాని, పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు తదితరులు పాల్గొన్నారు.