–8లో
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయంలోని నిత్యాన్నదానం ట్రస్టుకు రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన కొంపెల్ల అలివేలు, వారి కుటుంబ సభ్యులు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు.
ఆగుతూ.. ఊగుతూ..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో శానిటరీ మెటీరియల్‌తో సహ క్లీనింగ్, హౌస్ కీపింగ్, పారిశుధ్య పనులు రీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం కానుంది.
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముందస్తు సాగుపై ప్రభుత్వం లెక్క తప్పింది. అప్పుడేమో అంతన్నారింతన్నారు.. తీరా అదును దాటిపోతున్నా పాలకులు కన్నెత్తి చూడటం లేదు. ప్రకృతి విపత్తులకు దొరక్కుండా పంట చేతికి రావాలంటే ముందస్తు సాగుకు రైతులు సమాయత్తం కావాలంటూ కూటమి సర్కార్ ఊరూవాడా ఊదరగొట్టి చివరకు చేతులెత్తేసింది. కనీసం సమయానుకూలంగా సాగునీరు అందించలేక రైతులను ‘అడకత్తెరలో పోక చెక్క’ను చేసేసింది. జూన్ ఒకటి నుంచి కాలువలకు నీరు విడుదల, జూన్ 15 కల్లా నారుమళ్లు పూర్తిచేసి అదే నెల చివరికి నాట్లు ముగించాలి. అటు గోదావరి, ఇటు ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదలకు ఇబ్బంది ఉండదని కూటమి పెద్దలు ఘనమైన ప్రకటనలు చేశారు. జిల్లా రైతులు వారి మాటలు నమ్మి తొలకరి సాగుకు సమాయత్తమయ్యారు. తీరా చూస్తే అనుకున్నట్టుగా కాలువలు, ప్రాజెక్టుల నుంచి నీరు రాక ఖరీఫ్ ప్రశ్నార్థకమై రైతులు లబోదిబోమంటున్నారు. అప్పుడే జూలై 16వ తేదీ వచ్చేసింది. కానీ జిల్లాలోని గోదావరి కాలువ కింద, మెట్ట ప్రాంతంలో ప్రాజెక్టుల కింద ఆయకట్టులో కనీసం 10 శాతం నారుమళ్లు కూడా వేయలేకపోయారు. కేవలం బోర్లపై ఆధారపడ్డ రైతులు మాత్రమే అక్కడక్కడా నారుమళ్లు పోసుకుని సాగునీటి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2024–25 ఖరీఫ్ సీజన్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 94,594 హెక్టార్లు. ఖరీఫ్ అదును దాటిపోతున్నా ఇంతవరకు కేవలం 12 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. కొన్ని మండలాల్లో సెంటు భూమిలో కూడా నాట్లు పడలేదు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో కనీసం 10 శాతం సాగు కూడా ముందుకు సాగని విషయాన్ని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ఈస్ట్రన్ డెల్టాలో ఇప్పుడిప్పుడే..
జిల్లాలో ఈస్ట్రన్ డెల్టాతో పాటు గోదావరి కాలువ ద్వారా సాగయ్యే సామర్లకోట, కరప మండలాల్లో సాగునీరు ఇప్పుడిప్పుడే వస్తోంది. పంపా, తాండవ, ఏలేరు, పుష్కర ప్రాజెక్టుల నుంచి ఇప్పటి వరకు నీరు విడుదల కాలేదు. ఏలేరు నుంచి సాగుకు ఇప్పుడు వదిలినా అది చేలలోకి ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నుంచి నారుమళ్లు వేసి జూన్ నెలాఖరుకు నాట్లు పూర్తవ్వాల్సి ఉంది. ఇదే విషయాన్ని అధికారులు ప్రచారం చేశారు. ఈ సమయంలో నారు వేసి నాట్లు వేస్తేనే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ఉంటుందని అధికారులు చెబుతూ వచ్చారు. జూలై 16వ తేదీ వచ్చినా జిల్లాలో 10 శాతం నాట్లు కూడా పడలేదు. ఈ క్రమంలో నారు వేసే పనులు ఈ నెలాఖరుకు గాని పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సాగు 45 రోజులు ఆలస్యం కాగా మరింత జాప్యం జరిగితే ఆశలు వదిలేసుకోవాల్సిందేనంటున్నారు. వాస్తవానికి జూన్ నాటికి ఏలేరు జలాలు విడుదల చేయాల్సి వుంది. జూలై మొదటి వారం అయినా సాగునీరు విడుదల కాలేదు.
ఏలేరు నుంచి విడుదల చేశామంటున్నా..
ఏలేరు ప్రాజెక్టు నుంచి 1600 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏలేరు రిజర్వాయర్. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని జగ్గంపేట, ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల పరిధిలో సుమారు 56 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి 150 క్యూసెక్కులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పోను 50 క్యూసెక్కులు తిమ్మరాజు చెరువుకు, మిగిలిన 1400 క్యుసెక్కులు నాలుగు నియోజకవర్గాలు దాటి పిఠాపురం రావాల్సి ఉంది. ఈ నియోజకవర్గంలో సాగుచేస్తున్న 16,943 హెక్టార్లకు సుమారు 159 హెక్టార్లలో వరి నారుమళ్లు అవసరం. కానీ ఇప్పటి వరకూ ఎక్కడా 10 శాతం మించి నారుపోసిన దాఖలాలు లేవు. కాగా, జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 25 వేల హెక్టార్లలో వరి సాగవుతోంది. మెట్టలో రైతులు ఎక్కువగా చెరువులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు నీటితో నిండటంతో రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరంగా చేపట్టారు. గోకవరం మండలంలో ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు పది వేల హెక్టార్లు సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువ పరిధిలో సుమారు పది వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందక ఖరీఫ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది జూలై నెలలో 60 శాతం ఊడ్పులు పూర్తి కాగా, ఈ సీజన్‌లో 20 శాతానికి మించి కాలేదు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 27 వేల ఎకరాలకు సాగు నీరందాలి. ఈ సీజన్‌లో ఇప్పటికీ సాగునీరు విడుదల కాలేదు. సిమెంటు పైపుల స్థానంలో నూతనంగా ఐరన్ పైపులు నిర్మించడంతో పాటు ఇతర మరమ్మతులకు రూ.55 కోట్లకు ప్రతిపాదించగా ప్రభుత్వం మొండిచేయి చూపించడంతో పుష్కర నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. బొర్రంపాలెం ఎత్తిపోతల పథకంలో ఆయకట్టుకు కూడా చుక్కనీరు విడుదల కాక రైతులు లబోదిబోమంటున్నారు.
సక్రమంగా అందని గోదారి నీరు
కాకినాడ రూరల్‌లో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 4200 ఎకరాలలో వరి సాగు చేస్తుంటారు. చీడిగ, కొవ్వూరు, కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి, తూరంగి గ్రామాల ఆయకట్టుకు గోదావరి జలాలు, తిమ్మాపురం, సర్పవరం, పండూరు, పి.తిమ్మాపురం, నేమాం, తమ్మవరం, పెనుమర్తి తదితర గ్రామాల ఆయకట్టుకు ఏలేరు ఆధారంగా సాగవుతుంది. గోదావరి జలాలు విడుదల చేసినా సక్రమంగా అందడం లేదు. ఏలేరు నుంచి ఆలస్యంగా ఈనెల 7న నీరు విడుదల చేయగా కాకినాడ రూరల్ మండలంలోని ఆయకట్టు శివారుగా ఉండడంతో ఇప్పటికీ సాగునీరు సక్రమంగా అందడం లేదు. తిమ్మాపురం, పండూరు తదితర గ్రామాలలో నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు వర్షాలు లేక వెదజల్లు పద్ధతిలో సాగు చేపట్టేందుకు ఎదురు చూస్తున్న రైతులు నిరాశగా ఉన్నారు.
తూతూ మంత్రంగా క్లోజర్ పనులు
జిల్లాలో క్లోజర్ పనులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో మొదలు పెట్టడంతో తూతూ మంత్రంగా చేసేసి అయ్యిందనిపించడానికేనని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. క్లోజర్ పనులు జరుతున్నందున జూన్ నెలాఖరు నాటికి నీరు విడుదల చేస్తామని అధికారుల ప్రకటనలు గాలిలో కలిసిపోయాయి. ఖరీఫ్ దమ్ములు జరగాలంటే పూర్తి స్థాయిలో ఏలేరు రావల్సిందేనని రైతులు చెబుతున్నారు. పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో వరి పొలాల పరిస్థితి ఒకే విధంగా వుంది. ముందస్తు ఖరీఫ్ సాగు చేపడితే వరదల నుంచి తప్పించకునే అవకాశం ఉంటుందని బావించినా ప్రస్తుతం ఆలస్యం కావడంతో ఈ ఏడాది పంటలకు ముప్పు తప్పదంటున్నారు. ఏలేరు ఆయకట్టుకు అక్టోబర్ నెలలో వరద బెడద అధికం. మూడేళ్లుగా రైతులు వరదలతో నష్టపోతూనే వున్నారు. పంటల రక్షణకు జూన్‌లో వరి సాగు ప్రారంభించి నవంబరు, డిసెంబరు నాటికి వరికోతలు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేక సాగునీటి జాప్యంతో జిల్లాలో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేదా జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరికీ తమ గోడు పట్టడం లేదని రైతులు ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారు.
2024–25 ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం, నాట్లు వేసిన ఆయకట్టు వివరాలు (హెక్టార్లలో)
మండలం విస్తీర్ణం నాట్లు
కోటనందూరు 4110 0
తుని 3276 265
రౌతులపూడి 2446 220
శంఖవరం 1253 11
ఏలేశ్వరం 2669 0
జగ్గంపేట 4086 77
కిర్లంపూడి 5144 100
ప్రత్తిపాడు 4540 120
తొండంగి 5274 39
గొల్లప్రోలు 5372 816
పెద్దాపురం 4537 313
గండేపల్లి 3908 967
సామర్లకోట 9215 2738
పిఠాపురం 8000 38.71
యు.కొత్తపల్లి 4486 26
కాకినాడ రూరల్ 1780 80
కాకినాడ అర్బన్ 167 14
పెదపూడి 7361 760
కరప 5868 2060
కాజులూరు 7570 2758
తాళ్లరేవు 3532 606
మొత్తం 94594 12008.71
లెక్క తప్పిన అధికారులు
నీరందక అన్నదాత లబోదిబో
వరదలకు చిక్కుకోకూడదంటూ
మొదట్లోనే ముంచేసిన వైనం
జూలై 16 నాటికి జిల్లాలో కనీసం
10 శాతం నాట్లు కూడా పడని వైనం
రైతుల గోడు పట్టని మంత్రులు
దిక్కులు చూస్తున్న అన్నదాతలు
నారుమళ్లు ఎండిపోతున్నాయి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ముందుగానే సాగుకు సిద్ధం కావాలని అధికారులు చెప్పారు. వారి మాటలతో ఈ సారి ముందస్తు సాగు చేసేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ దుక్కులు దున్నుకోవడానికి సరైన వర్షాలు కూడా పడలేదు. వేలాది రూపాయలు వెచ్చించి వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. సాగునీరు ఎప్పుడు విడుదల చేసినా ముందుగానే నారుమళ్లు వేసుకునే వాళ్లం. కానీ ఈ సారి నారుమళ్లకు నీటి విడుదల లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయే వాతావరణం కనిపిస్తోంది.
– గంటా కొండబాబు, కాకరాపల్లి, కోటనందూరు మండలం
నీరు లేక సాగని పనులు
గతంలో ఎన్నడూ ఇలా లేదు. సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్‌లో నారుమడులు కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇంజిన్లతో నీరు తోడుకుందామంటే నీరు అందడంలేదు. నీళ్లు వదిలామని అధికారులు చెబుతున్నప్పటికీ కాలువల్లో నీరు కనిపించడంలేదు. నారుమడులకు నీటి ఎద్దడి ఇలా ఉంటే, రేపు నాట్లు పడితే ఎలా ఉంటుందో తెలియడంలేదు.
– లోకారెడ్డి అప్పన్నదొర, చేబ్రోలు శివారు లక్ష్మీపురం,
గొల్లప్రోలు మండలం
నీరుత్సాహంగా ఖరీఫ్
నీరుత్సాహంగా ఖరీఫ్
నీరుత్సాహంగా ఖరీఫ్