
15 వేల హెక్టార్లలో వరి నాట్లు
కరప: ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 93,500 హెక్టార్లలో వరి సాగు జరుగుతూండగా ఇప్పటి వరకూ 15 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయని జిల్లా వ్యవసాయాధికారి ఎన్.విజయ్ కుమార్ తెలిపారు. ఇందులో 6 వేల హెక్టార్లలో వెదజల్లు పద్ధతి అనుసరించామన్నారు. మరో నాలుగైదు రోజుల్లో 40 వేల ఎకరాల్లో నాట్లు పూర్తి చేయడానికి వరి నారు సిద్ధంగా ఉందని తెలిపారు. శివారు ప్రాంతాల్లో సాగునీటి సరఫరాను పరిశీలించేందుకు గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద విలేకర్లతో మాట్లాడారు. సాగునీటి ఎద్దడి లేని కరప, కాజులూరు, తాళ్లరేవు, పెదపూడి, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో వరి నాట్లు తొందరగా పూర్తి చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఎంటీయూ–7029 (స్వర్ణ), ఎంటీయూ–1318 రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారన్నారు. అవసరం మేరకే రైతులు ఎరువులు వాడాలని సూచించారు. నాట్లు పూర్తి చేసే సమయానికి మొదటి దఫాగా ఎకరానికి 25 కిలోల డీఏపీ, 10 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేస్తే సరిపోతుందన్నారు. ఈ సీజన్‌లో 48 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని, ఇప్పటి వరకూ 18 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని తెలిపారు. మరో 18 వేల టన్నుల ఎరువులను మార్క్‌ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ఎవరైనా ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, పురుగు మందులు కొంటేనే ఎరువులిస్తామని చెప్పినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు 42 డ్రోన్లు మంజూరయ్యాయని విజయ్ కుమార్ తెలిపారు. 36 గ్రూపులు సొమ్ము చెల్లించగా, 31 గ్రూపులకు డ్రోన్లు సరఫరా చేశామని తెలిపారు. 69 వేల మందికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉండగా.. ఇంతవరకూ 25 వేల మందికే ఇచ్చామన్నారు. అనంతరం కరప శివారు పేపకాయలపాలెంలో విజయ్ కుమార్ పర్యటించి పొలాలు, పంట కాలువల పరిస్థితిని పరిశీలించారు. సాగునీటి సమస్య ఉంటే తమ సిబ్బందికి తెలియజేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఐ.మంజు, కరప, కాకినాడ ఏడీఏలు కె.బాబూరావు, కె.దుర్గాలక్ష్మి, ఏఈఓ ప్రశాంత్ కూడా పాల్గొన్నారు.