
బాక్స్ బద్దలవుతుందనే భయంతో..
ఫ బాక్స్ టెండర్లు నిలిపివేసిన అధికారులు
ఫ ఆన్‌లైన్ టెండర్లకు ఆమోదం
పిఠాపురం: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న పాలకవర్గాన్ని పక్కన పెట్టి, అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు చేయాలనుకున్న కూటమి నేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తమ నేత మంజూరు చేసిన నిధులతో తామే పనులు చేయాలంటూ పట్టుబట్టి.. అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఆయా కాంట్రాక్టులు తమకే దక్కేలా చేసుకునేందుకు వారు చేసిన కుంతంత్రాలు చెల్లలేదు. వారి ఒత్తిడికి తలొగ్గి, పాలకవర్గాన్ని కాదని కొందరు అధికారులు చేసిన ప్రయత్నాలను కింది స్థాయి అధికారులు సైతం ఒప్పుకోలేదు. దీంతో, దిగివచ్చిన అధికారులు చివరకు నిబంధనల ప్రకారం పనులు చేయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కొన్నాళ్ల కిందట రూ.3 కోట్లు విడుదల చేశారు. తమకు కలసి వచ్చేందుకు వీలుగా ఈ పనులకు ఆన్‌లైన్‌లో కాకుండా బాక్స్ టెండర్లు పిలవాలని జనసేన నేతలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు అధికారులు బాక్స్ టెండర్లకు రంగం సిద్ధం చేశారు. దీనిని మున్సిపల్ పాలకవర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ లెక్క చేయకుండా మున్సిపల్ అధికారులు బాక్స్ టెండర్లకే మొగ్గు చూపారు. దీనిపై ఆమోదిస్తే బాక్స్ బద్దలే.. శీర్షికన గత నెల 28న సాక్షి కథనం ప్రచురించింది. దీంతో, దిగి వచ్చిన అధికారులు ఎట్టకేలకు బాక్స్ టెండర్లను నిలిపివేసి, ఆన్‌లైన్ టెండర్లకు ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ గత పది రోజులుగా ఏదో ఒక విధంగా బాక్స్ టెండర్లు వేసేలా చూడాలని జనసేన నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనికి ఒక జిల్లా ఉన్నతాధికారి కూడా మద్దతు పలకడంతో మున్సిపల్ అధికారులు బాక్సు టెండర్లకు ఏర్పాట్లు చేశారు. ఈవిధంగా నిబంధనలకు వ్యతిరేకంగా బాక్స్ టెండర్లు పిలిస్తే తాము బలైపోతామని మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగపు అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వారు స్పష్టం చేశారు. దీనికితోడు కోర్టును ఆశ్రయించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఆన్‌లైన్ టెండర్లు పిలుస్తూ శనివారం ప్రకటన జారీ చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి టెండర్లు స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.

బాక్స్ బద్దలవుతుందనే భయంతో..