ఫ పరిశ్రమలు పెట్టండి
ఫ లేదా ఆ భూమిని పేదలకివ్వండి
ఫ సీపీఐ నేత తాటిపాక మధు
కాకినాడ సిటీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ సెజ్‌పై ఇచ్చిన హామీలు మరిచారా అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం కాకినాడ సెజ్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, లేదంటే ఆ భూములను పేదలకివ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్‌లో ఆదివారం జరిగిన సీపీఐ కాకినాడ నగర 23వ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నమండ రామచంద్రరావు చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెజ్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని అంతా ఎదురు చూస్తున్నారన్నారు. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. సెజ్ ఏర్పాటు చేసి 19 ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమలు రాకపోగా ఆ భూములన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. పట్టుమని పదెకరాల్లో కూడా కార్యకలాపాలు కనిపించడం లేదన్నారు. చైనాకు చెందిన పల్స్‌ప్లష్ అనే సంస్థ బొమ్మల తయారీ యూనిట్ నడుపుతోందన్నారు. మరో మూడు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కొందరు మహిళలకు మాత్రమే వీటిలో ఉపాధి లభిస్తోందన్నారు. కాకినాడ పెట్రో కారిడార్ పేరిట పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా హామీలు కురిపించడం తప్ప పనులు జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. రైతుల నుంచి భూములు తీసుకున్న ఉద్దేశం నెరవేరలేదన్నారు. సెజ్ రైతుల సమస్యల పరిష్కారానికి గత ఏడాది నవంబర్ 4న పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాకినాడ సెజ్‌లో పరిశ్రమలు తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు గత ఏడాది జూలై 3న జరిగిన బహిరంగ సభలో సైతం హామీ ఇచ్చారని చెప్పారు. ఇక్కడి ప్రజలు గెలిపించిన తరువాత పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో సైతం పవన్ కల్యాణ్ సెజ్ గురించి ప్రస్తావించారని అన్నారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా సెజ్‌లో పరిశ్రమల జాడ కనిపించడం లేదని, పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురు చూస్తున్న యువత ఆశలపై పాలకులు నీళ్లు జల్లుతున్నారని విమర్శించారు. స్మార్ట్ కరెంటు మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని, బిల్లులు పెంచేందుకే వీటిని బిగించేందుకు సిద్ధమవుతున్నారని, వీటి రద్దుకు ఊరంతా ఏకమవ్వాలని, స్మార్ట్ మీటర్లు బద్దలుగొట్టాలని మధు పిలుపునిచ్చారు. పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి టి.అన్నవరం, మహిళా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.భవాని తదితరులు కూడా ప్రసంగించారు.