
ప్రసూతి సేవలకు ఏఐ అనుసంధానంతో అద్భుతాలు
కాకినాడ క్రైం: ప్రసూతి సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనుసంధానం చేయడం ద్వారా అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం అన్నారు. తద్వారా మహిళకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ ఆబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఏపీసీఓజీ) ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్ ఆబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాజికల్ సొసైటీ పదో వార్షిక సదస్సు శనివారం జరిగింది. కాకినాడ ఆబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాజికల్ సొసైటీ ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ వై.అనురాగమయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీతాశ్రీ, ట్రెజరర్ డాక్టర్ లక్ష్మీకిరణ్ సంయుక్త పర్యవేక్షణలో ఈ సదస్సు నిర్వహించారు. 72 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 1,200 మంది ప్రసూతి వైద్య నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. పలు రాష్ట్రాలకు చెందిన నిపుణులు గైనకాలజీలో అందుబాటులోకి వచ్చిన అధునాతన వైద్య సేవలు, ఏఐ అనుసంధానం, నూతన వైద్య ప్రక్రియలు, ఔషధాల పని తీరు, వివిధ ఆరోగ్య స్థితులల్లో ప్రసవ ప్రక్రియలను వివరించారు. అంతకు ముందు వర్క్‌షాప్ చైర్మన్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ ఆధ్వర్యాన నిర్వహించిన వర్క్‌షాప్‌లలో 20 వరకూ శస్త్రచికిత్సలు చేశారు. సదస్సు నిర్వహణలో డాక్టర్ సూర్యకుమారి, డాక్టర్ శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సు శనివారం ప్రారంభమైందని తెలిపారు. నూతన ప్రసూతి వైద్య నిపుణులకు ఈ సదస్సు ఓ వరమన్నారు. సదస్సులో ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఏఎల్ సత్యవతి, పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, మాజీ ఐఏఎస్ బాబూరావు నాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తదితరులు పాల్గొన్నారు. వక్తలుగా డాక్టర్ సంకేత్ పిసాట్, డాక్టర్ వినీత్ మిశ్రా, డాక్టర్ రామకృష్ణ హనుమాన్ వ్యవహరించారు.

ప్రసూతి సేవలకు ఏఐ అనుసంధానంతో అద్భుతాలు