
భారీ నష్టం వచ్చేలా ఉంది
రాత్రికి బాగున్న పంట ఉదయానికి నాశనమైపోతోంది. ఈ జలగ పురుగులను మేము ఎప్పుడూ చూడలేదు. మొదట్లో ఒకటి రెండు కనిపించగా ఉన్నట్టుండి వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం మాత్రమే ఆకులపై ప్రత్యక్షమవుతున్నాయి. రాత్రికి బాగున్న ఆకులు ఉదయానికి లేకుండా పోతున్నాయి. ఇలా పంట పూర్తిగా దెబ్బ తింటోంది. ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. వీటిని ఎలా నివారించాలో కూడా తెలియడం లేదు. వీటి వల్ల నేను వేసిన మిరప పంట చాలా వరకూ దెబ్బ తింది. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. భారీ నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొన్ని పురుగు మందులు కొట్టినా అవి పోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– ఓరుగంటి వెంకట సత్యనారాయణ,మిరప రైతు, చేబ్రోలు
తామర పురుగు పోయి జలగలు వచ్చాయి
ఎక్కడో చెరువుల్లోనో కాలువల్లోనో చూసే జలగలు ఇప్పుడు పంటలపై దాడి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ తామర పురుగుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు కొత్తగా జలగలు వచ్చి పడ్డాయి. అప్పటి వరకూ అవి ఎక్కడుంటున్నాయో కూడా తెలియడం లేదు. ఉదయం, సాయంత్రం కాగానే మొక్కలపై, ఆకులపై కనిపిస్తున్నాయి. ఒక్క రోజులోనే వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఏ మొక్కపై చూసినా ఇవే. ఆకుల్లోని రసాన్ని నిమిషాల్లో పీల్చేస్తున్నాయి. దీంతో సత్తువ కోల్పోయి మొక్కలు చనిపోతున్నాయి. పురుగు మందులు వాడినా ఫలితం లేదు. వీటి దాడితో మా పత్తి పంట తొలి దశలోనే నాశనమవుతోంది. – ఓరుగంటి శేఖర్, పత్తి రైతు, చేబ్రోలు
చర్యలు తీసుకుంటాం
ఈ జలగలు ఎక్కువగా పగలు దాక్కుని, రాత్రుళ్లు బయటకు వచ్చి, మొక్కలపై పాకుతూ, కాండం, ఆకులు తినేస్తాయి. దీంతో, మొక్క నాశనమవుతుంది. ఇవి ఎక్కువగా తేమగా ఉండే మట్టిలో కనిపిస్తాయి. నర్సరీల నుంచి తెచ్చిన మొక్కల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాల్లో ఈ మెట్ట జలగలను గుర్తించారు. ఇవి మన ప్రాంతంలో కనిపించడం ఇదే మొదటిసారి. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే. ఇవి వ్యాపించిన పంటలను పరిశీలించి, శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని, నివారణ చర్యలు తీసుకుంటాం. – వై.సోమరాజశేఖర్, ఉద్యాన శాఖాధికారి, పిఠాపురం
కొత్తగా
కనిపిస్తున్నాయి
మెట్ట జలగల వల్ల అపారనష్టం వస్తుంది. వీటి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ ప్రాంతంలో ఎక్కడా ఎప్పుడూ లేవు. వీటి ఉనికి కొత్తగా కనిపిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలను సంప్రదిస్తాం. తోటలను పరిశీలించి, ఏ మేరకు వ్యాపించాయి, ఎంత నష్టం కలిగిస్తున్నాయనే విషయాలు తెలుసుకుని, తగు చర్యలు తీసుకుంటాం.
– వీవీ సత్యనారాయణ,
వ్యవసాయశాఖాధికారి, గొల్లప్రోలు
● వాణిజ్య పంటలపై మెట్ట జలగల దాడి
● పత్తి, మిర్చి పంటలకు అపార నష్టం
● రైతుల ఆందోళన
పిఠాపురం: పంటలకు పురుగులు, తెగుళ్ల బెడద సర్వసాధారణం. మిడతల దండు దాడి చేసిన అరుదైన సందర్భాలూ ఉన్నాయి. కానీ, కనీవినీ ఎరుగని రీతిలో పంటలను నమిలి మింగేస్తున్న మెట్ట జలగల (డిరోసిరాస్ రెటికల్టమ్) గురించి మీరెప్పుడైనా విన్నారా! ఈ జలగలు ఇప్పుడు గొల్లప్రోలు మండలంలో స్వైర విహారం చేస్తున్నాయి. జలగ అంటే నీటిలో ఉండే జీవిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఈ మెట్ట జలగలు పంటలపై సంచరిస్తూ వాటికి పెను ప్రమాదంగా మారాయి. ఈ జలగలను చూస్తే ఒళ్లంతా జలదరిస్తుంది. ఇవి మెల్లగా పాకుతూ వెళ్లిన మార్గం తళతళా మెరుస్తూ ఉంటుంది. ఈ జలగలు పంటలపై దాడి చేస్తూండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నివారణకు ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం ఉండటం లేదని గగ్గోలు పెడుతున్నారు. వేలాదిగా దాడి చేస్తున్న జలగలు రాత్రికి రాత్రే పంటను నాశనం చేసేస్తున్నాయి. దీంతో రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. ఇక్కడ టమాటా, బెండ, మిరప, బీర, కాకర తదితర పంటలతో పాటు పత్తి కూడా రైతులు సాగు చేస్తూంటారు. ఇటీవల ఈ పంటలను మెట్ట జలగలు పీల్చి పిప్పి చేస్తున్నాయి. మొక్కల కాండంపై పాకుతూ, ఆకులు కాండం తినేస్తున్నాయి. దీంతో, మొక్కలు చనిపోతున్నాయి. సాధారణంగా భూమిలోనే ఉంటూ కనిపించకుండా పోతున్న ఈ జలగలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం ఒక్కసారిగా మొక్కలపై ప్రత్యక్షమై, పంటలను నాశనం చేస్తున్నాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, చెందుర్తి తదితర ప్రాంతాల్లో మిరప, పత్తి పంటలపై ఈ జగలగలు దాడి చేస్తున్నాయి. ఈ గ్రామాల్లోని రైతులు సుమారు 950 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో మిరప పంటలు సాగు చేశారు. సుమారు 300 ఎకరాల్లో పత్తి, మిరప పంటలపై ఈ జలగలు వ్యాపించి, మొక్క దశలోనే పంటను నాశనం చేస్తున్నాయి. పంటలు తొలి దశలోనే పాడైపోతూండటం చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పంటలను రక్షించాలని కోరుతున్నారు.
పంటను తినేస్తున్న మెట్ట జలగలు
జలగల దాడితో
మొక్క దశలోనే
దెబ్బ తిన్న పత్తి మొక్క
పంట పొలాల్లో
మెట్ట జలగల గుడ్లు
మెట్ట జలగలు

భారీ నష్టం వచ్చేలా ఉంది

భారీ నష్టం వచ్చేలా ఉంది

భారీ నష్టం వచ్చేలా ఉంది

భారీ నష్టం వచ్చేలా ఉంది