
ఇంటింటికీ ‘బాబు’ మోసాలు తీసుకువెళ్లాలి
● హామీల అమలుకు ప్రజల గళమై
ప్రశ్నించాలి
● కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ నేత
బొత్స సత్యనారాయణ పిలుపు
ఏలేశ్వరం: చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తీసుకువెళ్లి, ప్రజలను చైతన్యపరచాలని వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. కిర్లంపూడిలో శనివారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ పేరిట ప్రమాణ పత్రాలు పంపిణీ చేశారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేశారని చెప్పారు. అధికారం చేపట్టి 13 నెలలవుతున్నా, తూతూమంత్రంగా ఒక్క గ్యాస్ సిలిండర్, అరకొరకగా తల్లికి వందనం మినహా చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తున్న తమపై రాజద్రోహం కేసులు పెడతామంటూ బెదిరించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని, రాష్ట్రాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని అన్నారు. ఇచ్చిన హామీలు చేసేంత వరకూ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గత, బైబిల్, ఖురాన్‌గా భావించిందని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను మొదటి సంవత్సరంలోనే అమలు చేశారని బొత్స చెప్పారు.
ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిల్లో ఇంటింటికీ తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపారని అన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, చంద్రబాబు, మరో ఆరుగురు కలిసి మోసాల కంపెనీని ప్రారంభించారని, చంద్రబాబు ఎండీగా, లోకేష్ సీఎండీగా, పవన్, మిగతా వాళ్లు సభ్యులుగా కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ప్రజలను మోసం చేయడం మినహా చేసిన అభివృద్ధి లేదని అన్నారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు తానేటి వనిత, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, పార్టీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీశివకుమారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుజాత, పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బెహరా రాజరాజేశ్వరి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బదిరెడ్డి గోవింద్, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ ‘బాబు’ మోసాలు తీసుకువెళ్లాలి