
ప్రమాదకర పరిశ్రమల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి
కాకినాడ సిటీ: ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని, సమీపంలో ఉంటున్న ప్రజలకు ఆయా పరిశ్రమల్లో సంభవించే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డీవీవీఎస్ నారాయణ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశంలో తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు తీరు, ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వల వివరాలు, ప్రమాదాలు చోటు చేసుకునే సందర్భాల్లో పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. ప్రమాదకర పరిశ్రమల్లో తీసుకున్న భద్రతా చర్యలను డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రధానంగా 15 ప్రమాదకర పరిశ్రమలను గుర్తించామని తెలిపారు. ఆయా పరిశ్రమల్లో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా అలారం, సెన్సార్, ఇతర భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎం.శంకరరావు, పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్ గణపతి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జె.నరసింహ నాయక్, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, ఓఎన్‌జీసీ, కోరమండల్, రాక్ సిరామిక్స్, ఏఎం గ్రీన్ అమ్మోనియా తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రమాదకర పరిశ్రమల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి