
తలుపులమ్మకు రత్నగిరి నుంచి సారె
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి అన్నవరం వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం తరఫున చీర, సారె సమర్పించారు. ఆషాఢ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో అన్నవరం దేవస్థానం సిబ్బందితో కలసి ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు తలుపులమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె, పండ్లు, పూలు సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. శాంతి హోమం, పూర్ణాహుతిలో పాల్గొని, అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 20న ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి విశేష పుష్పాలంకరణ, లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్నట్టు లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. అమ్మవారికి 24న సప్తనదీ జలాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
రూ.1.05 లక్షల విరాళం
కాకినాడ సిటీ: కాకినాడలో హాకీ టోర్నమెంట్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ రూ.1,05,000 విరాళం సమర్పించింది. దీనికి సంబంధించిన చెక్కును సంఘం నాయకులు కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ జె.వెంకటరావుకు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కా ర్యదర్శులు ఎంవీఎస్‌ఎన్‌ఎన్ జగన్నాధం, జె.రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులు ఎ.రత్నరాజు, ఏపీడీ భానుప్రకాష్, జీఎస్‌టీఓ స్వామి, పెద్దాపురం తాలూకా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
ఉద్యోగుల గ్రీవెన్స్‌కు
26 వినతులు
కాకినాడ సిటీ: జిల్లాలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వివేకానంద హాలులో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమాని కి 26 వినతులు వచ్చాయి. ఉద్యోగుల నుంచి డీఆర్‌ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్ వినతులు స్వీకరించారు. ఈ వినతులను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు డీఆర్‌ఓ సూచించారు.
నేడు ‘స్వచ్ఛ దివస్’
కాకినాడ సిటీ: జిల్లావ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కింద స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనవసరమైన ప్లాస్టిక్ వస్తువులను నివారించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించుకోవాలనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణపై దృష్టి సారించాలన్నారు.

తలుపులమ్మకు రత్నగిరి నుంచి సారె