
‘40 మీటర్ల’ సిబ్బందిపై వేటు
● ఈపీడీసీఎల్ సామర్లకోట ఏఈ బదిలీ
● లైన్‌మన్, లైన్ ఇన్‌స్పెక్టర్‌ల సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విద్యుత్ మీటర్ల అనుసంధానంలో ఉదాసీనంగా వ్యవహరించి, ఒక కుటుంబానికి తల్లికి వందనం రాకపోవడానికి బాధ్యులైన అధికారి, సిబ్బందిపై ఏపీ ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు వేటు వేశారు. సామర్లకోటలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న కటకం నాగ సత్య గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ ‘మహిళ పేరుపై 40 విద్యుత్ మీటర్లు’ శీర్షికన ఈ నెల 17న ‘సాక్షి’ వార్త ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు శాఖాపరమైన విచారణ నిర్వహించారు. గంగాభవాని పేరిట ఉన్న 40 విద్యుత్ కనెక్షన్లు వాస్తవానికి ఎవరెవరి పేరున ఉన్నాయో విచారించి, వారి ఆధార్‌కు అనుసంధానం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించి, బాధ్యులైన ఏపీ ఈపీడీసీఎల్ సామర్లకోట ఏఈ రమేష్ కుమార్‌ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఈపీడీసీఎల్‌లో కన్‌స్ట్రక్షన్స్ విభాగానికి బదిలీ చేశారు. లైన్‌మన్ టి.వెంకటేశ్వరరావు, లైన్ ఇన్‌స్పెక్టర్ యు.లక్ష్మణరావులను సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ (ఆపరేషన్స్) వరప్రసాద్ వివరించారు.