
అవి నకిలీ పీఎఫ్ చలానాలే
అన్నవరం: గత మార్చి నుంచి మే నెల వరకూ సుమారు రూ.30 లక్షల మేర ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించినట్లుగా అన్నవరం దేవస్థానం శానిటేషన్ కాంట్రాక్ట్ సంస్థ కనకదుర్గ మ్యాన్‌పవర్ సర్వీసెస్ అందజేసిన రసీదులు నకిలీవేనని అధికారుల తనిఖీలో వెల్లడైంది. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఈ విషయం నిర్ధారించారు. దీంతో, ఈ అంశంపై రెండు రోజులుగా ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు వాస్తవాలేనని రుజువైంది. చేసిన మోసం గుట్టు రట్టవడంతో ఆ కాంట్రాక్టర్ హడావుడిగా మూడు నెలలకు సంబంధించి ఈ నెల 9, 14, 15 తేదీల్లో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షల చొప్పున చెల్లించి, ఆ రసీదులు దేవస్థానానికి అందజేశారు. అవి మాత్రం ఒరిజనలేనని అధికారుల పరిశీలనలో తేలింది. అయితే, మొదట ఇచ్చిన మూడు రసీదులు నకిలీవని తేలడంతో కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదుకు దేవస్థానం అధికారులు న్యాయసలహా తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులను కోరనున్నట్లు తెలిసింది.
జూన్ రసీదు కూడా ఫేక్
మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి మొదట ఇచ్చిన పీఎఫ్ రసీదులు నకిలీవని రుజువై, వివాదం నడుస్తూండగా.. తాజాగా జూన్ నెలకు సంబంధించి ఈ నెల 11న చెల్లించినట్లు కాంట్రాక్టర్ సమర్పించిన పీఎఫ్ రసీదు కూడా ఫేక్ అని అధికారులు గుర్తించారు. టీఆర్ నంబర్ 1222507006348తో రూ.10,34,052 చెల్లించినట్టు ఆ రసీదులో ఉంది. దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా టీఆర్ నంబర్ 1222504006459తో మార్చి నెలకు సంబంధించి రూ.10,09,914 చెల్లించినట్లుగా వచ్చింది. దీంతో ఆ రసీదును కూడా తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. తాజా వివాదంతో అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఈ నెల జీతాలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 12న కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చినప్పటికీ జూన్ నెలకు నకిలీ పీఎఫ్ రసీదు జమ చేయడంతో తిరస్కరించారు. మళ్లీ పీఎఫ్ చెల్లించి, రసీదు సమర్పించాక, తనిఖీలో అది ఒరిజనల్ అని రుజువయ్యాకే సిబ్బందికి జీతాలు అందనున్నాయి. ఇదంతా పూర్తయ్యాక ఈ నెల 24, 25 తేదీల్లో మాత్రమే సిబ్బందికి జూన్ నెల జీతాలు అందే అవకాశం ఉంది.
మోసం రుజువైంది
మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి దేవస్థానం పారిశుధ్య సిబ్బంది పీఎఫ్ అకౌంట్‌కు రూ.30 లక్షలు చెల్లించినట్లు శానిటేషన్ కాంట్రాక్టర్ ఫేక్ రసీదులు జమ చేశారని తేలింది. దేవస్థానాన్ని మోసం చేసినందుకు గాను కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవడంపై న్యాయ సలహా తీసుకుంటున్నాం.
– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
తాజావి మాత్రం ఒరిజనల్
నిర్ధారించిన అన్నవరం దేవస్థానం అధికారులు
శానిటేషన్ కాంట్రాక్టర్‌పై
చర్యల దిశగా అడుగులు!
సిబ్బంది ఖాతాలకు జమ
అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ కాంట్రాక్టర్ వద్ద 350 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మార్చి నెలలో 332 మందికి, ఏప్రిల్‌లో 335 మందికి, మే నెలలో 328 మందికి పీఎఫ్ జమ అయినట్లు తేలింది. వివిధ కారణాలతో మార్చి నెలలో 15 మందికి, ఏప్రిల్‌లో 30 మందికి జమ కాలేదు. ఆ నెలలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే అభియోగం మోపి, కూటమి ప్రజాప్రతినిధి సిఫారసుతో 12 మంది శానిటేషన్ సూపర్‌వైజర్లను తొలగించి, వారి స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలు 12 మందిని నియమించిన విషయం తెలిసిందే. దీంతో 24 మందికి పీఎఫ్ జమ కాలేదు. అలాగే అకౌంట్ నంబర్లలో తేడా వచ్చి మరో ఆరుగురికి జమ కాలేదని అధికారులు చెప్పారు. మే నెలలో 328 మందికి పీఎఫ్ జమ కాగా, 22 మందికి అవలేదు. వీరికి కూడా త్వరలోనే జమ అవుతాయని అధికారులు చెప్పారు.