
కీచకులపై చర్యలు తీసుకోండి
కాకినాడ రూరల్: రంగరాయ మెడికల్ కళాశాల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం వీడియో ప్రకటన విడుదల చేశారు. మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేరున్న రంగరాయ కళాశాలను కూడా కీచకులు వదలడం లేదని, పారా మెడికల్ విద్యార్థినుల పట్ల ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్లు ప్రవర్తించిన తీరు అమానుషమని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దాడులు, హత్యలు, లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగరాయ ఘటనపై స్పందించాలని నాగమణి కోరారు.
తలుపులమ్మకు సారె సమర్పణ
తుని: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసంలో మూడో శుక్రవారం కావడంతో పలు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. ఇళ్లల్లో స్వయంగా తయారు చేసిన పిండి వంటలతో నింపిన బిందెలను శిరస్సుపై ధరించి వస్తున్న భక్తులకు రాజగోపురం వద్ద ఆలయ ఈఓ విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు పర్యవేక్షించారు.
కుట్ర పూరితంగా
ఎస్సీవర్గీకరణ అమలు
జగ్గంపేట: ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నారని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్ నేత డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ తెలిపారు. జగ్గంపేటలో శుక్రువారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో మాలల ఉనికిని దెబ్బతీయడానికి పథకం ప్రకారం నేతలు ప్రయత్నిస్తున్నా వారికి బానిసలుగా, తొత్తులుగా మారిన మాల నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. సుప్రీంకోర్టు, జడ్జిలు, దేశ సంపద, మంత్రి పదవులు తదితర వాటిలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదా, దాన్ని అమలు చేయరా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకు పడేసే ఎంగిలి మెతుకుల్లోనే వర్గీకరణ పేరుతో పంపకాలు పెడతారా అని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ వర్గాల మధ్య ఘర్షణలు జరగడానికి పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ ఎస్సీ జనాభా ప్రాతిపదికన చేయలేదని అన్నారు. నేతలు కొప్పుల ప్రేమ్ బాబు, కనికళ్ల నాని, బచ్చల చిన్నా,బొండు రాజు,కూసి కొండబాబు పాల్గొన్నారు.

కీచకులపై చర్యలు తీసుకోండి