
రత్నగిరి భద్రత పటిష్టతకు తొలి అడుగు
● సీసీ టీవీ దృశ్యాల రికార్డింగ్
బ్యాకప్ 90 రోజులుండేలా చర్యలు
● ఇందుకోసం రూ.70 లక్షలతో
ఆన్‌లైన్ సర్వర్లు, హార్డ్‌డిస్క్‌లు
● అన్నవరం దేవస్థానం
పాలకవర్గం తీర్మానం
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భద్రతా చర్యలపై పాలకమండలి దృష్టి సారించింది. శుక్రవారం రత్నగిరిపై చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీసీ టీవీలు రికార్డు చేసిన దృశ్యాలు 90 రోజులపాటు సర్వర్‌లో ఉండేలా రూ.70లక్షల వ్యయంతో ఆన్‌లైన్ సర్వర్లు, హార్డ్‌డిస్క్‌లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం సీసీటీవీలు రికార్డు చేసిన దశ్యాలు 30 రోజులవి మాత్రమే సర్వర్‌లో ఉంటాయి. అయితే మిగిలిన ప్రముఖ దేవస్థానాలలో కనీసం 90 రోజులు సీసీటీవీ రికార్డింగ్ బ్యాకప్ సదుపాయం ఉంది. అన్నవరం దేవస్థానంలో 320 సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ బ్యాకప్ 90 రోజులకు పెంచుకోవాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ పలుమార్లు దేవస్థానం అధికారులకు సూచించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ నూకరత్నం, వీ రామకృష్ణ, ఎలక్ట్రికల్ డీఈ వీ సత్యనారాయణ పాల్గొన్నారు. మొత్తం పది అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.
తీర్మానాలు..
● మొదటి ఘాట్ రోడ్ వద్ద నుంచి న్యూసెంటినరీ సత్రం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారికి రూ.27 లక్షల వ్యయంతో విద్యుత్ దీపాలు, సౌండ్‌సిస్టమ్, సీసీ టీవీలు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ప్యానల్ బోర్డుల ఏర్పాటుకు ఆమోదం
● సత్యగిరి, రత్నగిరి ఘాట్‌రోడ్‌లలో, కొండ దిగువన ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలకు వీలుగా రూ.23 లక్షల వ్యయంతో ప్రీ కాస్ట్ ఆర్‌సీసీ డివైడర్స్ ఏర్పాటు ఆమోదం
● దేవస్థానంలో సత్యగిరి పవర్‌హౌస్ నుంచి విష్ణుసదన్ సత్రానికి ప్రస్తుతం విద్యుత్ సరఫరా చేస్తున్న కేబుల్ పాడైనందున దాని స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్, ప్యానల్ బోర్డును రూ.26 లక్షలతో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం
● ప్రధానాలయం, వ్రత మంటపాలు, ఉచిత క్యూ శ్లాబ్‌ల, విష్ణుసదన్ సత్రం జాయింట్ బీమ్‌లలో లీకేజీలు అరికట్టేందుకు రూ.18.65 లక్షలతో రస్ట్‌ప్రూఫ్ ట్రీట్మెంట్ గ్రౌటింగ్ పనులు చేసేందుకు ఆమోదం
● రూ.16 లక్షలతో పంపా రిజర్వాయర్ పవర్ ఆఫీసు వద్ద నిర్మించిన బోర్‌వెల్స్ వద్దకు సిబ్బంది వెళ్లడానికి ర్యాంప్ నిర్మాణం, రత్నగిరి వై జంక్షన్ వద్ద నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమోదం