
పశువైద్యాధికారి శ్రీనివాసు మృతి
ఆలమూరు: నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఏడీ నాన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చైర్మన్, పినపళ్ల గ్రామీణ పశు వైద్యాధికారి ఈదల శ్రీనివాసు (61) మంగళవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గుమ్మిలేరు, చింతలూరు, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, పినపళ్ల గ్రామాల్లో ఆయన పశువైద్యాధికారిగా సేవలందించారు.
ముగ్గురు అవినీతి అధికారులకు జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ముగ్గురు అవినీతి అధికారులను ఏసీబీ పట్టుకుందని ఆ శాఖ రాజమహేంద్రవరం డీఎస్పీ ఎం.కిశోర్ కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. మార్చి 24న పిఠాపురంలో రూ.20 వేలు లంచం అడిగిన కేసులో సబ్ ఇన్‌స్పెక్టర్ ఎల్.గుణశేఖర్, మార్చి 28న కాకినాడ రిజిస్ట్రార్ కె.ఆనందరావు, జూన్ 25న వీఆర్‌వో పరస శ్రీమన్నారాయణను అరెస్టు చేసి జైలుకి పంపామన్నారు. ఎవరైనా లంచం అడిగితే తనకు 94404 46160, రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్ ఎన్‌వీ భాస్కర్ 94404 46161, కాకినాడ జిల్లా ఇన్‌స్పెక్టర్ డి.వాసు 83329 71041, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్‌స్పెక్టర్ వై.సతీ ష్ 94404 46163లతో పాటు అవినీతి నిరోధకశాఖ రాజమహేంద్రవరం ల్యాండ్‌లైన్ నంబర్ 0883 2467833కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇసుక లారీ కింద పడి వ్యక్తి మృతి
ధవళేశ్వరం: ఇసుక లారీ కింద పడి ధవళేశ్వరం మసీదు వీధి కొండ మెరక ప్రాంతానికి చెందిన పువ్వల లక్ష్మణ్ (39) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పువ్వల లక్ష్మణ్ పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో పని కోసం రాజమహేంద్రవరానికి మోటారు సైకిల్‌పై బయలుదేరాడు. ధవళేశ్వరం క్వాయర్ బోర్డు ఎదురుగా ఆటోను తప్పించే ప్రయత్నంలో రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక వచ్చిన ఇసుక లారీ.. లక్ష్మణ్ కుడి కాలి పైనుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసును ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బంగారు, వెండి ఆభరణాల చోరీ
ఆలమూరు: కాంట్రాక్ట్ అధ్యాపకురాలి ఇంట్లో బంగారం వెండి వస్తువులను దొంగలు చోరీ చేశారు. పెదపళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవి. గ్రామానికి చెందిన నరసింహదేవర వెంకటదుర్గ అచ్యుత విశాలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఈనెల నాలుగున తన కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్లారు. అనంతరం ఈ నెల ఏడున తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి పరిశీలించగా బీరువాలోని సుమారు రూ.8 లక్షల విలువైన 11 కాసుల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై జి.నగేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
10 నుంచి బిక్కవోలు – అనపర్తి రైల్వే గేటు మూసివేత
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని బిక్కవోలు – అనపర్తి మధ్య ఉన్న 415 రైల్వే గేటు (605/9–11) ను ఈ నెల 10 నుంచి 13 వరకూ మూసివేయనున్నట్టు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రామ సుబ్బారావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. రైల్వే గేటులోని ప్రధాన ట్రాక్ మరమ్మతుల కోసం ఈ గేటు మీదుగా రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. ఈ మేరకు అనపర్తి తహసీల్దార్, పోలీసు అధికారి, అనపర్తి, లక్ష్మీనారాయణపురం, కాపవరం పంచాయతీ అధికారులకు, లారీ, ఆటో యూనియన్ అసోసియేషన్లకు సమాచారం ఇచ్చామన్నారు. ఇటుగా రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.