
10 నుంచి పొగాకు విత్తనాల విక్రయం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ –నిర్కా) (పూర్వపు సీటీఆర్‌ఐ)లో 2025–26 సీజన్‌కు ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నాణ్యమైన వర్జినియా పొగాకు విత్తనాలు విక్రయించనున్నారు. వీటిని ఎస్‌బీఎస్, ఎస్‌ఎల్‌ఎస్, ఎన్‌బీఎస్, ఎన్‌ఎల్‌ఎస్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మంగళవారం ప్రకటనలో కోరారు. అలాగే 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కందుకూరులోని వాణిజ్య వ్యవసాయ పరిశోధనాసంస్థ (పూర్వపు సీటీఆర్‌ఐ)లో కూడా పొగాకు విత్తనాల విక్రయాలు ప్రారంభమవుతాయన్నారు. జీబీఆర్‌ఎస్ పాస్‌బుక్ ఉన్న రైతులకు ప్రతి బ్యారన్‌కు 500 గ్రాముల చొప్పున కిలో రూ.1,300కు విక్రయిస్తారన్నారు. కావాల్సిన రైతులు బ్యారన్ రిజిస్ట్రేషన్ పాస్‌బుక్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. క్యాష్‌లెస్ లావాదేవీలు అనగా యూపీఐ (గూగుల్ పే, ఫోన్ పే ), క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మాత్రమే అనుమతి ఉందన్నారు. పొగాకు బోర్డు ద్వారా రిజిస్టర్ చేయించిన కమర్షియల్ నారుమడులకు సంబంధించిన రైతులకు కిలో విత్తనాలను రూ.2,200కు విక్రయిస్తారన్నారు.