రక్కసీ కోత | - | Sakshi
Sakshi News home page

రక్కసీ కోత

Jul 9 2025 6:32 AM | Updated on Jul 9 2025 6:32 AM

రక్కస

రక్కసీ కోత

ప్రస్తుతం మాయాపట్నం వద్ద కడలిలో కలిసిపోయిన జియోట్యూబ్‌ రక్షణ గోడ

ఉప్పాడ శివారు మాయాపట్నం వద్ద బీచ్‌ రోడ్డుకు రక్షణగా వేసిన

జియో ట్యూబ్‌ రక్షణ గోడ (ఫైల్‌)

కరిగిపోతున్న ఉప్పాడ తీరం

సముద్రంలో కలసిపోతున్న భూములు

రక్షణ చర్యలు చేపట్టని ప్రభుత్వం

నెరవేరని పవన్‌ కల్యాణ్‌ హామీ

పిఠాపురం: ఉప్పాడ తీరంలో సముద్రం తరచూ ఉగ్రరూపం దాల్చుతుంటుంది. తుపాను రానప్పటికీ, ఉపద్రవాల హెచ్చరికలు లేనప్పటికీ సముద్ర కెరటాలు ఒక్కసారిగా ఉప్పొంగుతుంటాయి. దీంతో తీరం వెంబడి భూమి మీటర్ల మేర కోతకు గురవుతోంది. ఉప్పాడతో పాటు దాని శివారు గ్రామాలు కడలిలో కలిసి పోతుంటాయి. ఇలా సుమారు శతాబ్ద కాలంగా కడలి కబలించేస్తున్నా శాశ్వత రక్షణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నవి గుడిసెలే కదా అని రూ.లక్షల్లో ఉన్న ప్రతిపాదనలను పట్టించుకోక పోవడం వల్ల వందల ఎకరాల పంట భూములు, పురాతన ఆలయాలు, భవంతులు కడలి గర్భంలో కలిసిపోయాయి. కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభం లాంటి బీచ్‌ రోడ్డు నిర్మించిన నాటి నుంచే కడలిపాలవుతూనే ఉంది.

ఉప్పాడ రక్షణకు చర్యలు ఉత్తిమాటేనా?

కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.వందల కోట్లతో చర్యలు తీసుకుంటున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరిచిపోయారు. గత ఏడాది ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన రక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో తీర ప్రాంత రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో గత ఏడాది జూలై 24న కలెక్టర్‌ ఆధ్వర్యంలో డీఎఫ్‌ఓ భరణి, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌ (ఎన్‌సీసీఆర్‌) జాయింట్‌ సెక్రటరీ రమణ మూర్తి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప్పాడ నుంచి కాకినాడ పోర్టు వరకు తీర ప్రాంతం అభివృద్ధి, ఉప్పాడ తీరం కోత, ఇతర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఇవన్నీ జరిగి ఏడాది పూర్తవుతున్నా కనీసం ప్రణాళికలు కూడా తయారు కాలేదు.

పెరిగిన కోత

గత కొన్ని నెలలుగా ఉప్పాడ తీర ప్రాంతం తీవ్ర కోతకు గురవుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా నిత్యం కోత బారిన పడుతోంది. ఇప్పటి వరకు రక్షణగా ఉన్న జియోట్యూబ్‌ టెక్నాలజీ రక్షణ గోడ పూర్తిగా కడలిలో కలిసి పోగా, పక్కనే ఉన్న పంట పొలాలు సైతం సముద్రంలో మునిగిపోతున్నాయి. ఇలా ఇప్పటి వరకు 1,360 ఎకరాల పంట భూమి కోతకు గురై కడలి గర్భంలో కలిసి పోయింది. ఈ తీర ప్రాంత రక్షణకు రూ.250 కోట్లతో ప్రణాళికలు అన్న మాట కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌సీసీఆర్‌ అధ్యయనం ప్రకారం కోస్తా తీరంలో ఉప్పాడ కొత్తపల్లి, సఖినేటిపల్లి మండలాలు ప్రమాద స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. 1956 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉప్పాడ గ్రామంలోనే సుమారు 85 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయినట్లు గుర్తించారు.

కోతకు కారణమేదే!

గోదావరి ఇసుక కొట్టుకు రావడం వల్ల కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్‌ ఐలాండ్‌ కారణంగానే ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ ఐలాండ్‌ సముద్రంలో 40 చదరపు మైళ్ల విస్తీర్ణం గల లోతు లేని అగాధం (కాకినాడ బే) సృష్టించడం వల్ల దీని సమీపంలోని ఉప్పాడకు ముప్పు ఉందని నిర్ధారించారు. ఉత్తరం వైపు నుంచి తెరుచుకుని ఉండే ఈ అగాధం దక్షిణ వైపు నుంచి తీరానికి వెళ్లే అలలను అడ్డుకుంటోంది. దీంతో అలలతో పాటు వెళ్లే పదార్థాలు (లిట్టోకల్‌ డ్రిప్టు) తీరం చేరడం లేదు. దానివల్ల అలల తాకిడితో హోప్‌ ఐలాండ్‌లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు తీరంలో మట్టి కోతకు గురవుతుంది.

గ్రామాలు కోతకు గురైన భూమి (ఎకరాల్లో)

ఉప్పాడ 84.51

రమణక్కపేట 13.01

అమరవిల్లి 133.50

సుబ్బంపేట 141.30

కోనపాపపేట 233.56

మూలపేట 359.78

కొమరగిరి 362.83

మొత్తం 1,360

పొంచిఉన్న ప్రమాదం

కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభమైన ఉప్పాడ తీరం శాశ్వత రక్షణకు చర్యలు చేపట్టలేకపోతే, ప్రత్యామ్నాయం అయినా చూడాలి. ఉప్పాడ కోతకు అడ్డుకట్ట వేస్తానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశించిన తీర ప్రాంత వాసులకు నిరాశ మిగిలింది. దీంతో గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర కోత కారణంగా ఇప్పటి వరకూ సుమారు 32 వేల నివాస గృహాలు కడలిలో కలసిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి.

75 ఏళ్ల క్రితమే..

1950లోనే ఉప్పాడ తీరానికి సముద్ర కోత వల్ల ముప్పు ఉందని అఽధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఈ మేరకు సర్వే జరిపిన విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. 1971లో కోత తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 1992లో పూణేలోని అప్పటి పీడబ్ల్యూఆర్‌ఎస్‌ డైరెక్టర్‌ సీవీ గోలే అధ్యక్షతన ఒక సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం సాంకేతిక పరంగా సర్వేలు జరిపి ఉప్పాడ ప్రాంతం కోత.. విశేష స్వభావం కలిగినదిగా తెలిపింది.

రక్కసీ కోత1
1/4

రక్కసీ కోత

రక్కసీ కోత2
2/4

రక్కసీ కోత

రక్కసీ కోత3
3/4

రక్కసీ కోత

రక్కసీ కోత4
4/4

రక్కసీ కోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement