
వీరేశ్వరా.. క్షమించవా..
ఐ.పోలవరం: మురమళ్ల భఽధ్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి కొబ్బరి కాయలతో అభిషేకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. అధికారుల నిరక్ష్యంతో కొబ్బరికాయలు పక్కదారి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆలయంలో ప్రతి రోజూ రాత్రి జరిగే కల్యాణాలకు సంబంధించి ఉదయం అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అభిషేకానికి సంబంధించి ఒక టిక్కెట్టుకు రెండు కొబ్బరి కాయలు కేటాయిస్తారు. పండితులు వీటితో భక్తుల గోత్రనామాలతో స్వామికి, వినాయకునికి అభిషేకాలు చేస్తారు. ప్రతి నిత్యం సుమారు 116 కల్యాణాలు ఇక్కడ జరుగుతాయి. అంటే రోజుకు 232 కొబ్బరికాయలు కొట్టాలి. కానీ ఆలయంలో 15 రోజులకు సంబంధించి కేవలం ఒక్క రోజు మాత్రమే స్వామికి అభిషేకాల కొబ్బరి కాయలు కొట్టారు. మిగిలిన రోజులు స్వామికి ఎగనామం పెట్టేశారు. అభిషేకాలకు సంబంధించిన కొబ్బరి కాయలు ఎక్కడకు వెళ్లాయో తెలియదు.
భక్తుల ఆవేదన
స్వామివారి కల్యాణానికి రుసుము రూ.1,000 తీసుకుంటారు. భక్తుల నమ్మకాన్ని కొందరు అవినీతి పరులు సొమ్ము చేసుకొంటున్నారు. స్వామివారి అభిషేకానికి ఉపయోగించాల్సిన కొబ్బరి కాయలను పక్కదారి పట్టించి, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచార, సంప్రదాయాలను, పూజాది కార్యక్రమాలు తుంగలోకి తొక్కేస్తున్నారు. కొబ్బరి ధర హెచ్చును సాగుగా చూపుతూ కొబ్బరి నీళ్ల అభిషేకానికి స్వస్తి పలికేశారు. దీనిపై ఆగ్రహించిన కొందరు భక్తులు నేరుగా ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపొయింది. కొబ్బరి కాయల పాటదారునికి షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆయన తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే అభిషేకాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదాలకు రుచి, శుచి కరువైయ్యిందనే భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై సహాయ కమిషనర్ వి.సత్యనారాయణను వివరణ కోరగా కొబ్బరి కాయలు ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిందని, సంబంధిత పాటదారునికి నోటీసులు అందజేసి యథావిధిగా అభిషేకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అభిషేకానికి ఉపయోగించే
కొబ్బరి కాయలు పక్కదారి
మురమళ్ల ఆలయంలో ఘటన
అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం

వీరేశ్వరా.. క్షమించవా..