
చంద్రబాబు అంటేనే మోసం..దగా
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా
సామర్లకోట: చంద్రబాబు అంటేనే మోసం..దగా అని దీనిని ప్రజలందరూ గుర్తించారని కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. పెద్దాపురం నియోజవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు ఽఅధికారం కోసం ఏదైనా చేస్తారన్నారు. నాలుగుసార్లు మోసం చేయడంతో తనను నమ్మరని తెలిసి పవన్‌కల్యాణ్‌ను అడ్డు పెట్టుకున్నారన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మరో పర్యాయం మోసం చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేశారని తెలిపారు. రైతులను, మహిళలను, యువతను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దానికి ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ పర్యటన చేసిన ప్రజలు ఉప్పెనలా రావడంతో చంద్రబాబు చూడలేక పోతున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లే వారిపై కేసులు పెడతామని చెప్పి 1,200 మందిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాస్పత్రులలో మందులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియంను రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సూపర్ సిక్స్‌లో రెండు పథకాలు మాత్రమే అరకొరగా అమలు చేస్తున్నారన్నారు. సూపర్ సిక్స్‌పై పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకొవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రతీ కార్యకర్తకు తాను అండగా ఉంటానని, అవసరమైతే పోరాటాలకు సిద్ధమని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ఏక పక్షంగా విజయం సాధించే విధంగా కార్యకర్తలు ఐక్యతతో పని చేయాలన్నారు. దొరబాబును ఎమ్మెల్యేగా చేయడానికి ప్రతీ ఒక్కరూ పని చేయాలని సూచించారు.
అర్హతే ప్రామాణికంగా పథకాలు...
జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని, వైఎస్సార్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. సీఎం స్థానంలో ఉన్నవారికి మేనిఫెస్టోపై బాధ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో తాను మాట్లాడిన దానికి తప్పుడు అర్థాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు. తమది ఉడత బెదిరింపులకు భయపడే కుటుంబం కాదని, ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు. పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగి, వారికి ఏమి మేలు చేశారని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్‌లు ఇంటింటికీ సంక్షేమ పథకాలతో కుటుంబానికి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ బాండ్లు పంపిణీ చేశారని, అధికారంలోనికి వచ్చాకా మొండి చెయ్యి చూపించారని విమర్శించారు.