
అదే వేలంకొర్రి!
కౌలు రైతులను
ఇబ్బందులు పెట్టకండి
శ్రీ సంస్థానంకు చెందిన తొండంగిలోని భూములకు కౌలు వేలం వేయడానికి అధికారులు మూడు నెలల నుంచి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. వాయిదాలు వేయడం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సాగుకాలం దగ్గర పడడంతో ఇప్పటికే చాలామంది రైతులు దుక్కులు దున్నుకుని, నారుమడులకు సిద్ధపడుతున్నారు. దేవదాయశాఖ అధికారులు ఇకనైనా వాయిదా వేయకుండా వేలం నిర్వహించడం కానీ లేకుంటే ప్రస్తుతం ఉన్న రైతులకే కౌలు కొనసాగించడం కానీ చేయాలి.
– నాగం గంగబాబు, వైస్ ఎంపీపీ, తొండంగి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: లక్షల ఆదాయం వస్తుందని తెలిసినా దాన్ని రాబట్టుకోవడంలో దేవదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. పిఠాపురం మహారాజా దానం చేసిన వందల ఎకరాల భూములకు వేలం నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ దేవాదాయానికి గండికొడుతున్నారు. అధికార పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగుతూ వారు చెప్పినట్టు తలాడిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేలం వాయిదాకు వారు చూపుతున్న సాకులు, చెబుతున్న కారణాలు చూసి రైతులు విస్తుపోతున్నారు. మొదట మే 23, తరువాత జూన్ 6 అన్నారు. ఆ తరువాత జూన్ 20కి వాయిదా వేసి అప్పుడు కూడా వేలం నిర్వహించలేదు. తిరిగి ఈ నెల ఎనిమిదిన అన్నారు. ఆ తేదీన కూడా జరపలేదు. మళ్లీ జూలై14 తేదీకి వాయిదా వేశారు. ఒకోసారి ఒకో కుంటిసాకు చెబుతూ వేలాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
కడపలో టీడీపీ మహానాడుకు రైతులు వెళ్లిపోతున్నారని ఒకసారి, యోగా డే అని మరోసారి, తాజాగా మంగళవారం పోలీసు బందోబస్తు లేదని...ఇలా వాయిదాలు వేస్తూ అధికారులు కూటమి నేతల కొమ్ము కాస్తూవస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవదాయశాఖ కాకినాడ జిల్లా కార్యాలయం నుంచి పిఠాపురం శ్రీ సంస్థానం కార్యనిర్వాహణాధికారి కార్యాలయం వరకు అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సంస్థానంకు చెందిన రెండు పంటలు పండే సారవంతమైన 511 ఎకరాలున్నాయి. ఇందులో రైతులు మకాంలు తీసేయగా సాగులో ఉన్న మిగిలిన 478 ఎకరాలకు వేలం వేయకుండా నాలుగోసారి కూడా వాయిదా వేయడం విస్మయానికి గురిచేస్తోంది. దేవదాయశాఖ చరిత్రలో ఇంత నిస్సిగ్గుగా ఇన్ని వందల ఎకరాల భూములకు వేలం వేయకుండా వాయిదాలు వేస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. దేవదాయశాఖ పారదర్శకంగా వేలం వేస్తే హక్కులు దక్కించుకుందామని, కౌలుకు సాగు చేసుకుందామని సుమారు రెండు వందల మంది కౌలు రైతులు ఎదురుచూస్తున్నారు. పంపా జలాశయంలో నీటిమట్టం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఒక పక్క ఖరీఫ్ సాగుకు అదను దగ్గర పడుతోంది. వేలం ఎప్పుడు వేస్తారో? భూములు ఎవరికి దక్కుతాయా అని ఎదురుచూస్తూ ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న కౌలు రైతులు దుక్కులు దున్ని ఆకుమడుల కోసం భూములు సిద్ధం చేస్తున్నారు. అసలు భూములకు వేలం వేస్తారా లేదా అని కౌలురైతులు అనుమానపడుతున్నారు.
దొడ్డిదారిన దక్కించుకోవాలని...
పంపా ఆయకట్టు పరిధిలోకి వచ్చే ఈ భూములను మూడేళ్ల కాలానికి వేలం నిర్వహిస్తుంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేలం నిర్వహించి మూడేళ్ల కాలానికి రైతులకు భూములు కౌలుకు ఇచ్చారు. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు కౌలు ఖాయమైంది. కౌలు గడువు ముగిసిపోయింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అంతే తుని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలిపోయారు. వేలం వేయకుండా దొడ్డిదారిన ఆ భూములను దక్కించుకోవాలనే కుయుక్తులతో అధికార పార్టీకి చెందిన తుని పెద్దన్న కనుసన్నల్లో తెలుగు తమ్ముళ్లు పెద్ద స్కెచ్ వేశారు. మొదట భూములకు వేలం వేయకుండా అడ్డుకట్ట వేయాలనేది వారి ప్లాన్. అంత వరకు వారు దేవదాయశాఖ అధికారుల తోడ్పాటుతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారంతా భూములు ఎలా దక్కించుకోవాలనే ఎత్తుగడలకు పదును పెడుతున్నారు.
శ్రీ సంస్థానం భూముల వేలంపాట
మళ్లీ వాయిదా
దేవాదాయానికి ‘తమ్ముళ్ల’ తూట్లు
ఏటా రూ.70 లక్షల ఆదాయానికి గండి
నాలుగోసారి వాయిదా పడిన వైనం
చక్రం తిప్పుతున్న తుని పెద్దన్న
ఎంతకాలం వాయిదాలు వేస్తారు?
వాస్తవానికి ఈ భూముల వేలం ద్వారా ఏటా శ్రీ సంస్థానానికి సుమారు రూ.70 లక్షల ఆదాయం వస్తోంది. అదే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా పారదర్శకంగా గనుక వేలం నిర్వహిస్తే మూడేళ్ల కాలానికి రూ.2.15 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంతటి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా దేవదాయశాఖ అధికారులు మాత్రం అధికారపార్టీ నేతలకు కొమ్ము కాస్తూ వాయిదాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. నాడు పిఠాపురం రాజా బాటసారులు, పాదగయ, కుక్కుటేశ్వరస్వామి తదితర ఆలయాలకు వచ్చే భక్తుల ఆకలితీర్చాలనే ఆశయంతో 511 ఎకరాలు దానం చేశారు. శ్రీ సంస్థానం సత్రం పిఠాపురంలో ఉన్నప్పటికీ భూములు మాత్రం తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఉన్నాయి. తొండంగి మండలంలో 538, 545, 553, 535, 623, 565, 690 సర్వే నంబర్‌లలో ఈ భూములున్నాయి. ఇన్ని ఎకరాలకు వేలం వేయకుండా ఎంతకాలం వాయిదాలు వేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
పవన్ పట్టించుకోవడం లేదేం?
ఇదిలా ఉండగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్ద యుద్ధమే చేస్తున్నారని పవన్ అభిమానులు గొప్పగా చెప్పుకొంటున్నారు. అటువంటి పవన్ శ్రీ సంస్థానం భూముల వేలం నిర్వహించకపోవడంపై ఎందుకు దృష్టి పెట్టడంలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భూములున్నది తుని నియోజకవర్గంలో అయినా భూములిచ్చింది పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పిఠాపురం రాజా అనే విషయాన్ని పవన్ అభిమానులు గుర్తించకుంటే ఎలా అంటున్నారు. చివరకు శ్రీ సంస్థానం కార్యాలయం కూడా పిఠాపురంలో ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు.

అదే వేలంకొర్రి!

అదే వేలంకొర్రి!