
లేటరైట్ రవాణా వాహనాల అడ్డగింపు
రౌతులపూడి: గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల దోపిడీ ఆపాలంటూ సబ్‌ప్లాన్ ఏజెన్సీ వాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సబ్‌ప్లాన్ ఏజెన్సీ ప్రాంతంలో యథేచ్ఛగా లేటరైట్ రవాణా చేసే లారీలను జల్దాం, మాతయ్యపేటకు చెందిన పలువురు గిరిజనులు అడ్డుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులు దోచేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన నాటి ప్రతిపక్ష నాయకులు (నేటి పాలకులు) మూడేళ్ల క్రితం సబ్‌ప్లాన్ ఏజెన్సీలో పర్యటించి గిరిజన ప్రాంతాలను ఉద్దరిస్తామంటూ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. అధికారరంలోకి వచ్చింది సహజ వనరులు దోపిడీకేనా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమిడికలొద్దు ప్రాంతంలో లాటరైట్‌ను వందలాది భారీ వాహనాల్లో భారీగా రవాణా సాగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. శబ్ధ,వాయు కాలుష్యాలకు గురై నిత్యం అనారోగ్యాల పాలవుతున్నామని, రహదారులు ఛిద్రమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. రహదారికిరువైపులావున్న వ్యవసాయ భూములు నాశనమవుతన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల్లోను, స్థానిక పోలీస్ స్టేషన్‌లోను జిల్లా కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. సీఎంఓ కార్యాలయానికి, అటవీ, పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశామని వారు వివరించారు. స్థానిక గిరిజనులను మభ్యపెట్టి లాటరైటను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే లాటరైట్ తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లారీలు అడ్డగించడంతో రవాణా చేసేవారికి గిరిజనులకు కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై లాటరైట్ నిర్వాహకులకు తెలియజేసి తక్షణమే లాటరైట్ రవాణాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన నాయకులు గంటిమళ్ల గంగరాజు, రావుల తారక్, ఆమూరి సుధారాణి, ఆమూరి చంద్రారెడ్డి పాల్గొన్నారు.