రత్నగిరికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

Jul 20 2025 2:45 PM | Updated on Jul 21 2025 5:53 AM

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

అన్నవరం: రత్నగిరికి శనివారం భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సుమారు 20 వేల మంది దర్శించుకున్నారు. ఉదయం నుంచీ భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు.

లోవ భక్తుల కోసం లక్ష ప్రసాదం ప్యాకెట్లు

ఆషాఢ మాసం ఆదివారం తలుపులమ్మ తల్లి దర్శనానికి లోవ దేవస్థానానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు వారాల్లో సుమారు 3 లక్షల ప్రసాదం ప్యాకెట్లు కొనుగోలు చేయగా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నేడు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తలుపులమ్మ తల్లి ఆలయానికి వెళ్లే అవకాశం ఉంది. వారు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వీలుగా రత్నగిరి తొలి పావంచా వద్ద స్టాల్‌, జాతీయ రహదారిపై రెండు నమూనా ఆలయాల వద్ద, రత్నగిరి పైన కౌంటర్లలో విక్రయానికి సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శృంగార వల్లభుని

ఆలయంలో రద్దీ

పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,50,679 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. సుమారు 3 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.

యాని‘మేత’ర్‌ అరెస్టు

కిర్లంపూడి: మహిళా సంఘాల డబ్బులు కాజేసి, పరారైన ఓ యానిమేటర్‌ను కిర్లంపూడి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్సై జి.సతీష్‌ కథనం ప్రకారం.. బూరుగుపూడి గ్రామానికి చెందిన దుర్గ అదే గ్రామంలో నాలుగేళ్లుగా 42 డ్వాక్రా గ్రూపులకు యానిమేటర్‌గా పని చేస్తోంది. 2023లో 12 మహిళా గ్రూపులకు సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించింది. అనంతరం, ఆ డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో పథకం ప్రకారం ఎనిమిది గ్రూపుల సభ్యులను మభ్యపెట్టింది. వారి ఖాతాల్లో వేరే గ్రూపులకు సంబంధించిన డబ్బులు పడ్డాయంటూ మాయమాటలు చెప్పింది. ఆ డబ్బులు డ్రా చేసే నెపంతో వారి నుంచి వేలిముద్రలు, సంతకాలు తీసుకుని సుమారు రూ.20.25 లక్షలు కాజేసింది. అనంతరం సీ్త్రనిధి లోన్‌ డబ్బులు కట్టాలంటూ వెలుగు సిబ్బంది ఆయా గ్రూపుల సభ్యులను అడగడంతో గుట్టు రట్టయ్యింది. దీంతో, దుర్గను గ్రూపు సభ్యులు, వెలుగు సిబ్బంది నిలదీయగా అసలు విషయం చెప్పింది. వారం రోజుల్లో ఆ డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికింది. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులతో కలసి, రాత్రికి రాత్రే గ్రామం విడిచి పరారైంది. దీనిపై దేవీశక్తి డ్వాక్రా గ్రూప్‌ అధ్యక్షురాలు కె.వీరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దుర్గ మహారాష్ట్రలోని సోలాపూర్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, శనివారం ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరిచారు. నిందితురాలికి న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండు విధించడంతో రాజమహేంద్రవరంలోని మహిళా జైలుకు తరలించామని ఎస్సై సతీష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement