
పొంచి ఉన్న నక్కలగండి
● తూతూమంత్రంగా అభివృద్ధి పనులు
● ముక్కలవుతున్న నక్కలఖండి కాలువ గట్టు
● 3 వేల ఎకరాల ఆయకట్టుకు ముంపు భయం
పిఠాపురం: గత ఏడాది వచ్చిన వరదలకు గొల్లప్రోలు పరిధిలోని నక్కలఖండి కాలువకు పడమటదొడ్డి లాకుల సమీపాన పొలాల వద్ద గండి పడింది. దీంతో, సుమారు 3,000 ఎకరాల్లో రూ.కోట్ల విలువైన పచ్చని పంటలు ముంపు బారిన పడ్డాయి. ఆ గండిని అధికారులు ఇటీవల రూ.8 లక్షలు వెచ్చించి పూడ్చారు. అయితే, అత్యంత కీలకమైన ఈ పనులను తూతూ మంత్రంగా నిర్వహించారని రైతులు ఆరోస్తున్నారు. గండి పూడ్చివేత పనులు పూర్తయ్యి వారం రోజులు కూడా కాక ముందే తిరిగి అక్కడ గట్టు బీటలు వారుతూండటమే దీనికి కారణం. గట్టు అండలు అండలుగా జారిపోతోంది. ఒక మోస్తరు వర్షం కురిస్తే ఈ గట్టు తిరిగి ముక్కలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గండి పూడ్చివేత పనులను అధికారుల పర్యవేక్షణ లేకుండా, ఎటువంటి నాణ్యతా ప్రమాణాలూ పాటించకుండా నిర్వహించినందువల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు విమర్శిస్తున్నారు. దీనికితోడు గండి పక్కనే గట్టు బలహీనంగా మారింది. అక్కడ మరో గండి పడే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీనిపై జలవనరుల శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా తాము పంటలు సాగు చేసే అవకాశం లేదని, ఒకవేళ సాగు చేసినా ఏ క్షణంలో వరద వచ్చినా పంటలు కొట్టుకుపోతాయని అంటున్నారు. అధికారులు వెంటనే గండి పడిన చోట, బలహీనంగా ఉన్న చోట గట్టును పటిష్టపరచాలని రైతులు కోరుతున్నారు.