
‘మా ఆకలి కేకలు పట్టవా?’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): సుపరిపాలన తొలి అడుగు అంటూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు చేపట్టామని గొప్పలు చెబుతున్న సీఎం, డిప్యూటీ సీఎంకు తమ ఆకలి కేకలు పట్టవా అని సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద వాటర్ ప్రాజెక్టు కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టి, కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీను, ఇసాక్ మాట్లాడుతూ, 19 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో.. కుటుంబ పోషణ కష్టమై సమ్మె బాట పట్టామన్నారు. 25 నెలలుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ కట్టడం లేదని ఆరోపించారు. సుపరిపాలన అని చెప్పుకుంటూ తిరిగే నేతలకు తమ ఆకలి బాధ అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఈ సమ్మె కారణంగా సుమారు 85 గ్రామాల్లో దాదాపు మూడు లక్షల మంది మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తమ వేతనాల విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో సమ్మె చేపట్టగా.. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చినప్పటికీ, అది ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 52 మంది కార్మికుల కుటుంబాల ఆకలికేకలను దృష్టిలో ఉంచుకుని, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి కె.రామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎంపై
కార్మికుల మండిపాటు
కళ్లకు గంతలతో సత్యసాయి
డ్రింకింగ్ ప్రాజెక్టు సిబ్బంది నిరసన