
ఇచ్చిన హామీని పవన్‌కల్యాణ్ నెరవేర్చాలి
పిఠాపురం: మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని విస్మరించారని ఏపీ మత్స్యకార, మత్స్య కార్మిక సంఘం ఆలిండియా కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ రమణి ఆరోపించారు. మత్స్య కార్మిక సంఘం, మత్స్యకార సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నుంచి పిఠాపురం వరకు ర్యాలీ నిర్వహించి, పిఠాపురం జనసేన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మత్స్యకారులకు ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయన్నారు. ప్రధానంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని, కానీ అమలు చేయడం లేదన్నారు. దీనిపై దశలవారీ పోరాటం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ముందుగా తెలియజేసినప్పటికీ, ఇన్‌చార్జి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని, ఇది మత్స్యకారులను అవమానించడమేనన్నారు. దీంతో వినతిపత్రం తీసుకుంటేనే కానీ కదిలేది లేదని బైఠాయించడంతో, కార్యాలయ సిబ్బంది వినతిపత్రం తీసుకున్నారన్నారు. ఇలాంటి చర్యలు కూటమి నేతలకు తగదన్నారు.
నష్ట పరిహారం ఇప్పించాలి
ఓఎన్‌జీసీ, ఆయిల్ కంపెనీలు, ఫార్మా కంపెనీల వల్ల నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం నెలకు రూ.11,500 ఇప్పించాలని రమణి డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకు ఓఎన్‌జిసీ, ఇతర ఆయిల్ కంపెనీలు, ఫార్మా కంపెనీల కార్యకలాపాలతో వేట సరిగా జరగడం లేదన్నారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని చెప్పారు. అందువల్ల ముమ్మిడివరం నియోజకవర్గం, యానాంలో ఇస్తున్నట్టుగా, కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు యు.సత్యనారాయణ మాట్లాడుతూ, తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మత్స్య కార్మిక నాయకులు సంగాడి ఈశ్వరరావు, తెలుగు జనతా పార్టీ నాయకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మత్స్యకారులకు బీమా చేయించాలని, తీరంలో ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలని, మత్స్యకారులను రైతులుగా గుర్తించి బ్యాంకు రుణాలు ఇప్పించాలని, సీఎస్సార్ నిధులు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని, సొసైటీలను పునరుద్ధరించాలని, సబ్సిడీపై పరికరాలు అందించాలని తదితర డిమాండ్లతో వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ నాయకులు బడే సత్యారావు, కోనాడ తాతారావు, మైలపల్లి బుజ్జి, పిక్కి రాజు, వీరబాబు, బొడ్డు నాగేశ్వరరావు, వివిధ గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు.
మత్స్య కార్మిక సంఘం,
మత్స్యకార సంఘాల ఐక్య వేదిక నాయకుల డిమాండ్
పిఠాపురం జనసేన కార్యాలయం వద్ద ఆందోళన