మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025

Jul 22 2025 7:55 AM | Updated on Jul 22 2025 8:37 AM

సాక్షి, రాజమహేంద్రవరం: విద్యుత్‌ శాఖలో స్మార్ట్‌ మీటర్లు కలకలం రేపుతున్నాయి. వీటిని తమ నెత్తిన బలవంతంగా పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో విద్యుత్‌ వినియోగదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు విద్యుత్‌ వినియోగం నమోదు చేసే మీటర్‌ రీడర్లకు సైతం ఈ ‘స్మార్ట్‌’ షాక్‌ తగులుతోంది. దశల వారీగా అన్ని రకాల విద్యుత్‌ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు బిగించేందుకు విద్యుత్‌ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 10 వేలకు పైగా స్మార్ట్‌ మీటర్లు బిగించారు. ఒక్క నవ్య తూర్పు గోదావరి జిల్లాలోనే 6 వేలకు పైగా బిగించారు. స్మార్ట్‌ మీటర్ల ప్రక్రియ పూర్తయితే మొబైల్‌ ఫోన్ల మాదిరిగానే విద్యుత్‌కు కూడా రీచార్జ్‌ పాలసీ అమలులోకి వస్తుంది. అంటే, కరెంటు కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలన్న (ప్రీపెయిడ్‌) మాట. ఇది వినియోగదారులకు ఇబ్బందికరంగా మారనుండగా.. మరోవైపు ఉపాధి కోల్పోయి మీటర్‌ రీడర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తనుంది.

తొలి దశలో 5 లక్షల మీటర్లు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గృహ విద్యుత్‌ కనెక్షన్లు సుమారు 16.70 లక్షలున్నాయి. అలాగే, వాణిజ్యం 1,93,613, వ్యవసాయం 63,751, పారిశ్రామికం 6,314, హెచ్‌టీ 11 కేవీ 1,292 చొప్పున కనెక్షన్లు ఉన్నాయి. తొలి దశలో సుమారు 5 లక్షల మీటర్లు బిగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నవ్య తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 6.70 లక్షల విద్యుత్‌ సర్వీసులుండగా.. తొలి విడతగా 2 లక్షల వరకూ స్మార్ట్‌ మీటర్లు అమర్చే ప్రక్రియకు నాంది పలికారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు వీటిని బిగిస్తున్నారు.

రోడ్డున పడనున్న మీటర్‌ రీడర్లు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా మీటర్‌ రీడర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారే. ప్రతి నెలా 1 నుంచి 11వ తేదీ లోపు వీరు మీటర్‌ రీడింగ్‌ తీస్తారు. ఒక మీటర్‌ రీడింగ్‌ తీసినందుకు గాను విద్యుత్‌ శాఖ సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.6 నుంచి రూ.7 చెల్లిస్తుంది. రీడింగ్‌ యంత్రం చార్జీలు, ఫోన్‌ రీచార్జ్‌, పేపర్‌ రోల్‌, మరమ్మతులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ మినహాయింపులు పోనూ ఒక్కో రీడర్‌కు చేతికి మీటర్‌కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్కో రీడర్‌ నెలకు 3 వేల మీటర్ల వరకూ రీడింగ్‌ తీస్తారు. దీని ప్రకారం వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేలలోపే ఉంటుంది. ప్రాంతం, పట్టణాన్ని బట్టి రీడింగ్‌ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొంతమంది సిబ్బందితో పాటు మీటర్‌ రీడర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు విద్యుత్‌ రీచార్జ్‌పై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. ముందుగా రీచార్జి చేయించుకోని వారి ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. దీనివలన నేరుగా లైన్ల నుంచి విద్యుత్‌ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పొట్టకూటి కోసం పోరుబాట

చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న విద్యుత్‌ మీటర్‌ రీడర్లు కూటమి ప్రభుత్వం షాక్‌ ఇవ్వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ చలో విజయవాడ నిర్వహించారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని గళమెత్తారు. 20 ఏళ్లుగా విద్యుత్‌ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న తమకు న్యాయం చేయాలని నినదించారు. ఈ ఆందోళనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది మంది తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు తీరుపై విమర్శలు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం అయిన తరువాత వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్‌ మీటర్లు పెడితే పగులగొట్టాలంటూ అప్పట్లో పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్‌.. ప్రస్తుతం వీటిని వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు.

మీటర్‌ రీడర్ల డిమాండ్లివీ..

కూటమి ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లు తీసుకువస్తున్నందున ఇప్పటికే కొనసాగుతున్న తమకు విద్యుత్‌ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని మీటర్‌ రీడర్లు డిమాండ్‌ చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, విద్యార్హతను బట్టి రీడర్లకు విద్యుత్‌ శాఖలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ షిఫ్ట్‌ ఆపరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా.. మిగిలిన వారిని వాచ్‌మెన్‌, అటెండర్లుగా నియమించాలని కోరుతున్నారు. అలాగే, ఎస్క్రో ఖాతా వెంటనే తెరవాలని, కాంట్రాక్టర్లు, విద్యుత్‌ శాఖ అధికారులతో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్మార్ట్‌ మీటర్లు వద్దు

విద్యుత్‌ శాఖనే నమ్ముకుని ఇరవయ్యేళ్లుగా బతుకుబండి లాగుతున్న మీటర్‌ రీడర్ల ఉపాధికి గండి కొట్టడం తగదు. అసలు మొత్తం స్మార్ట్‌ మీటర్ల ప్రక్రియనే విరమించుకోవాలి. ఇది అనైతికం. ప్రజల వద్ద పెద్ద ఎత్తున బిల్లులు వసూలు చేసేందుకు అమలు చేస్తున్న కుట్ర. ఒకవేళ తప్పనిసరిగా అమలు చేస్తే మీటర్‌ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి.

– తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి

లో

10

స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లకు

సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

ఇకపై బిల్లు తీసే ప్రక్రియకు మంగళం

ఉమ్మడి జిల్లాలో 500 మందికి పైగా

మీటర్‌ రీడర్ల ఉపాధికి గండి

మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 20251
1/3

మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 20252
2/3

మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 20253
3/3

మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement