తడుపు.. మోపెడు | - | Sakshi
Sakshi News home page

తడుపు.. మోపెడు

Jul 20 2025 2:45 PM | Updated on Jul 21 2025 5:53 AM

తడుపు

తడుపు.. మోపెడు

పెట్టుబడి పెరిగింది

నీటి ఎద్దడి కారణంగా మొక్కజొన్న సాగులో పెట్టుబడి పెరిగింది. కాలువల్లో నీరు లేకపోవడంతో కేవలం బోర్లపై ఆధారపడి సాగు చేయాల్సి వస్తోంది. బోర్ల ద్వారా నీటిని కుంటలకు మళ్లించి, మళ్లీ అక్కడి నుంచి ఇంజిన్లతో తోటలకు మళ్లించాల్సి వస్తోంది. అదే కాలువల్లో సాగునీరుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం నీటి ఎద్దడి వల్ల ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అదనపు భారం పడుతోంది. వినాయక చవితికి మంచి డిమాండ్‌ ఉంటుందని మొక్కజొన్న సాగు చేపట్టాం. కానీ, వచ్చే లాభాల కంటే పెట్టుబడి తడిసి మోపెడయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

– సుంకర సూరిబాబు, మొక్కజొన్న రైతు, తాటిపర్తి

ఎద్దడి లేకపోతే..

రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతూండటంతో ఈ ఏడాది స్వీట్‌కార్న్‌ సాగు పెరిగింది. మార్కెటింగ్‌ సదుపాయంతో పాటు పెట్టుబడి పోనూ ఆదాయం కూడా అధికంగా ఉంటోంది. మెట్ట, లంకలు, ఏజెన్సీకే పరిమితమైన స్వీట్‌కార్న్‌ను ప్రస్తుతం డెల్టా ప్రాంతంలోనూ సాగు చేస్తున్నారు. జిల్లాలోని గొల్లప్రోలు మండలంలో మొక్కజొన్న సాగు అధికంగా ఉంది. అందరు రైతులకూ ఇచ్చేవి తప్ప మొక్కజొన్న రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలేవీ లేవు. నీటి ఎద్దడి లేకపోతే సాగు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

– స్వాతి, సహాయ సంచాలకులు,

వ్యవసాయ శాఖ, పిఠాపురం

మొక్కజొన్నకు నీటి ఎద్దడి

పెరుగుతున్న సాగు పెట్టుబడి

గగ్గోలు పెడుతున్న రైతులు

పిఠాపురం: వర్షాకాలంలో వరి, పత్తి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. గింజల కోసమే కాకుండా.. పశువులకు పచ్చిమేత గాను ఇది ఉపయోగపడుతుంది. దీంతో, ఎక్కువ మంది రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, కిర్లంపూడి, దేవీపట్నం, సీతానగరం ప్రాంతాల్లో మొక్కజొన్న సాగును రైతులు ఎక్కువగా చేపడుతున్నారు. మెట్ట ప్రాంతం, రేగడి నేలలు అధికంగా ఉండటంతో పాటు గత ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో కొన్నేళ్లుగా మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. కానీ, ఈ ఏడాది నీటి ఎద్దడి, మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలూ లేకపోవడంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అమాంతం పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15 వేల హెక్టార్లు కాగా, ఈ సమయానికి 800 హెక్టార్లలో సాగు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ సుమారు 200 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్న సాగు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రుతుపవనాలు ప్రవేశించి ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. మొదట్లో భారీ వర్షాలతో దంచి కొట్టిన వరుణుడు కొన్నాళ్లుగా ముఖం చాటేశాడు. మరోవైపు గోదావరి డెల్టా కాలువలకు గత నెల ఒకటో తేదీ నుంచే నీరు విడుదల చేస్తున్నారు. అయితే, వరి సాగుకు మినహా ఈ నీరు తగినంత స్థాయిలో మొక్కజొన్న తోటలకు అందే పరిస్థితి లేకపోవడం దీని సాగుపై ప్రభావం చూపుతోంది.

ప్రోత్సాహం కరవు

ఆత్మ పథకం కింద వ్యవసాయ శాఖ గతంలో జిల్లావ్యాప్తంగా బ్లాకుకు రెండు మూడు రైతు క్షేత్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, మొత్తం 18 బ్లాకుల్లో మొక్కజొన్న సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేది. ప్రతి రైతుకు రూ.3 వేల విలువైన స్వీట్‌కార్న్‌ (తీపి మొక్కజొన్న) విత్తనాలతో పాటు, రెండు రకాల క్రిమి సంహారక మందులు ఉచితంగా అందజేసేవారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహాకాలూ లేవు. ఫలితంగా మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గిపోయింది. మొక్కజొన్న తోటకు వివిధ రకాల పక్షులు, ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కాండం తొలిచే పురుగు ఆశిస్తూంటుంది. వీటన్నింటి నుంచి పంటను రక్షించుకుంటేనే అధిక దిగుబడి వస్తుంది. అది జరగడానికి ప్రభుత్వం నుంచి తగినంత సహకారం ఉండాలని రైతులు చెబుతున్నారు. పరిస్థితి ఎలా ఉన్నా రైతులు వినాయక చవితి ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చే విధంగా కేవలం రెండు నెలల్లోనే దిగుబడి ఇచ్చే మొక్కజొన్న రకాలను సాగు చేస్తున్నారు. నీటి ఎద్దడి కారణంగా దిగుబడులు తగ్గి, నష్టపోయే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 15 వేల హెక్టార్లు

ఈ ఏడాది సాగు అంచనా 10 వేల హెక్టార్లు

ఇప్పటి వరకూ సాగు జరిగిన విస్తీర్ణం 200 హెక్టార్లు

సాగు చేసిన రైతులు 380 మంది

ఎకరాకు పెట్టుబడి సుమారు రూ.30 వేలు

నీటి ఎద్దడితో పెరుగుతున్న ఖర్చు ఎకరాకు రూ.10 వేలు

తడుపు.. మోపెడు1
1/3

తడుపు.. మోపెడు

తడుపు.. మోపెడు2
2/3

తడుపు.. మోపెడు

తడుపు.. మోపెడు3
3/3

తడుపు.. మోపెడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement