
ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం తప్పించాలి
కాకినాడ సిటీ: సమాజానికి ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. కాకినాడ పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యాన శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్థానిక ఆనంద భారతి గ్రౌండ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీరపాండ్యన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన పెంచుకుని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, నిత్య జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్లాస్టిక్ నిషేధాన్ని సంపూర్ణంగా సాధించవచ్చని చెప్పారు. జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని కలెక్టరేట్ నుంచే ప్రారంభించామన్నారు. అనంతరం కలెక్టర్ అందరితో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని పారిశుధ్య కార్మికులను సత్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, రంగోలిలో పాల్గొన్న మహిళలకు, ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు వీరపాండ్యన్, కలెక్టర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ట్రైనీ కలెక్టర్ మనీషా, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కేపీ సుధాకర్, మెప్మా పీడీ బి.ప్రియంవద, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జె.నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ, ప్లాస్టిక్ కాలుష్యం దుష్ప్రభావాలను వివరిస్తూ మెప్మా ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, మహిళలు వేసిన ముగ్గులను అతిథులు పరిశీలించారు.