
ఈనెల 25 నుంచి ఆరంభం
ఒక్క భాద్రపద మాసం మినహా శ్రావణం మొదలు నవంబరు వరకు ముహూర్తాలే ముహూర్తాలు
ఈసారి ఘనంగా మోగనున్నపెళ్లిబాజాలు
మళ్లీ డిసెంబరు 8 నుంచి ఫిబ్రవరి 6 వరకు ముహూర్తాల్లేవు
సాక్షి, అమలాపురం: శుభకార్యాలకు నెలవైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి ఆరంభం కాబోతోంది. ముహూర్తాలు కూడా బాగా ఉండడంతో ఈసారి పెళ్లిబాజాలు ఘనంగా మోగనున్నాయి. ఎక్కడికక్కడ అమ్మవారి ఆలయాలను సైతం ముస్తాబు చేస్తున్నారు. మహిళలు పూజలకు సిద్ధమవుతున్నారు. ఆషాడం వీడి శ్రావణం మొదలుకానుండడంతో వ్యాపారులు, రైతులు మార్కెట్‌పై కొత్త ఆశలు పెట్టుకున్నారు.
ఈ సీజన్‌లో వస్త్రాలు, పూలు, పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ పెరగనుంది. వచ్చే శుక్రవారం నుంచే శ్రావణమాసం మొదలుకానుండడంతో శుభ ముహూర్తాల సీజన్ మొదలవుతుంది. నవంబరు వరకూ ఈ సుముహూర్తాల సీజన్ కొనసాగనుంది. ఇక ఈసారి భాద్రపద మాసం మినహా శ్రావణ మాసం మొదలు నవంబరు వరకు ప్రతినెలా ముహూర్తాలు ఉండటం విశేషం.
ముహూర్తాల తేదీలు ఇవే..
ఈ నెలలో 26, 30, 31 తేదీల్లోను, ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీల్లో ముహూర్తాలున్నాయి. అలాగే, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకూ భాద్రపద మాసం. ఇది శూన్యమాసం కావడంతో ముహూర్తాలు లేవు. ఆ తర్వాత సెప్టెంబరులో 23 నుంచి ప్రారంభమై 24, 26, 27, 28 తేదీల్లో.. అనంతరం అక్టోబరు, నవంబరు నెలల్లో కూడా ముహూర్తాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.
ఈ మాసాల్లో ఏకంగా 13 రోజుల చొప్పున శుభ ముహూర్తాలు ఉండటం విశేషం. అక్టోబరులో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31 తేదీలు.. నవంబరులో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 తేదీల్లో శుభ ఘడియలున్నాయి. అనంతరం.. డిసెంబరు 8 నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకూ ఇంచుమించు రెండు నెలలపాటు ముహూర్తాలు లేవు.
పురోహితులు, వ్యాపారుల్లో ఆశలు..
ఈ సంవత్సరం జూన్ 10 నుంచి ఈనెల 8 వరకూ గురు మౌఢ్యమి కావడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాల వంటి ముహూర్తాల్లేవు. ఈనెల 31న పెద్ద ముహూర్తం కావడంతో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. గత రెండునెలలుగా శుభ కార్యక్రమాల్లేక ఇబ్బందిపడుతున్న పురోహితులతో పాటు వారికి అనుబంధంగా ఉపాధి పొందేవారికీ రానున్న కాలం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.