breaking news
Shravan masam
-
విశేష ఫల ప్రదం
నాగపంచమి/గరుడ పంచమి: నాగారాధనకు సంబంధించిన ముఖ్యరోజులలో కార్తీకశుద్ధ పంచమి ‘గరుడ పంచమి’ లేదా ‘నాగ పంచమి’ గా ప్రసిద్ది. కొన్నిప్రాంతాలలో నాగపంచమిని శ్రావణమాసంలో ఆచరిస్తారు. గరుత్మంతుడు సూర్యుడికి రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందుకే ఆయనకి సుపర్ణుడని పేరు. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే... ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉన్న మూర్తి కనిపిస్తుంది. అంటే విష్ణుమూర్తి తనను ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసమే. నాగులనుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లలను కా పాడుకొనేందుకు చేసే పూజ నాగపంచమి, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యం పోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మనికొన్నిప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృ ప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ/నాగ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుందని నమ్ముతారు. ఇదే రోజున నాగపంచమి వ్రతం చేసుకునేవారు నాగుల ఆకారాన్ని ఇంటి గోడలమీద తీర్చిదిద్ది పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. నాగారాధన వల్ల సర్పదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఈరోజున చేసే నాగారాధన వల్ల చర్మవ్యాధులు, చెవి సంబంధిత రోగాలు తొలగుతాయని కూడా ప్రతీతి.మహనీయుల మాటలు→ ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించాలి. ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించాలి. ఏది మనకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చేసుకోవాలి.→ మంచి ఆలోచనలతో మనసు నింపుకో మంచి పనులతో ప్రతిష్ట పెంచుకో మంచి పలుకులతో మన్ననలు అందుకో వీటి అన్నిటితో అందరిని కలుపుకొని పో→ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ భయపడేవారు ఏమీ సాధించలేరు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.→ బయటకు కనిపించే రంగు,రూ పాన్ని చూసి ఎవ్వరినీ అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచేంతవరకూ కాకి, కోయిల రెండూ ఒకేలా ఉంటాయి.→ అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు, తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞాన వంతులు.‘ -
శ్రావణ మాసం వచ్చేస్తోంది..! మంచి ముహూర్తాలు ఎప్పుడంటే..
సాక్షి, అమలాపురం: శుభకార్యాలకు నెలవైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి ఆరంభం కాబోతోంది. ముహూర్తాలు కూడా బాగా ఉండడంతో ఈసారి పెళ్లిబాజాలు ఘనంగా మోగనున్నాయి. ఎక్కడికక్కడ అమ్మవారి ఆలయాలను సైతం ముస్తాబు చేస్తున్నారు. మహిళలు పూజలకు సిద్ధమవుతున్నారు. ఆషాడం వీడి శ్రావణం మొదలుకానుండడంతో వ్యాపారులు, రైతులు మార్కెట్‌పై కొత్త ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్లో వస్త్రాలు, పూలు, పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ పెరగనుంది. వచ్చే శుక్రవారం నుంచే శ్రావణమాసం మొదలుకానుండడంతో శుభ ముహూర్తాల సీజన్ మొదలవుతుంది. నవంబరు వరకూ ఈ సుముహూర్తాల సీజన్ కొనసాగనుంది. ఇక ఈసారి భాద్రపద మాసం మినహా శ్రావణ మాసం మొదలు నవంబరు వరకు ప్రతినెలా ముహూర్తాలు ఉండటం విశేషం. ముహూర్తాల తేదీలు ఇవే..ఈ నెలలో 26, 30, 31 తేదీల్లోను, ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీల్లో ముహూర్తాలున్నాయి. అలాగే, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకూ భాద్రపద మాసం. ఇది శూన్యమాసం కావడంతో ముహూర్తాలు లేవు. ఆ తర్వాత సెప్టెంబరులో 23 నుంచి ప్రారంభమై 24, 26, 27, 28 తేదీల్లో.. అనంతరం అక్టోబరు, నవంబరు నెలల్లో కూడా ముహూర్తాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.ఈ మాసాల్లో ఏకంగా 13 రోజుల చొప్పున శుభ ముహూర్తాలు ఉండటం విశేషం. అక్టోబరులో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31 తేదీలు.. నవంబరులో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 తేదీల్లో శుభ ఘడియలున్నాయి. అనంతరం.. డిసెంబరు 8 నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకూ ఇంచుమించు రెండు నెలలపాటు ముహూర్తాలు లేవు.పురోహితులు, వ్యాపారుల్లో ఆశలు..ఈ సంవత్సరం జూన్ 10 నుంచి ఈనెల 8 వరకూ గురు మౌఢ్యమి కావడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాల వంటి ముహూర్తాల్లేవు. ఈనెల 31న పెద్ద ముహూర్తం కావడంతో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. గత రెండునెలలుగా శుభ కార్యక్రమాల్లేక ఇబ్బందిపడుతున్న పురోహితులతో పాటు వారికి అనుబంధంగా ఉపాధి పొందేవారికీ రానున్న కాలం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. -
బంజారాల బతుకమ్మ..తీజ్
ఖమ్మం కల్చరల్: తీజ్ (గోధుమ మొలకల) వ్రతం. బంజారాల కన్నెల పండుగ..కన్నుల పండువగా చేసుకునే ఈ వ్రతాన్ని తండాల్లో పెళ్లికాని యువతుల ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. శ్రావణమాసంలో జరుపుకునే ఈ పండగన్ని రోజులూ లంబాడ తండాల్లో సందడి నెలకొంటుంది. తండా పెద్ద అనుమతి లభించిన వెంటనే వేడుక ప్రారంభమవుతుంది. మేర వసూలతో ఉత్సవానికి శ్రీకారం చుడతారు. మేర వసూలు తీజ్ నిర్ణయం జరిగిన మరుసటిరోజు యువతులు ఇల్లిల్లూ తిరిగి తీజ్ కోసం వసూలు చేసే విరాళాలనే ‘మేర’ అంటారు. దుకాణం నుంచి గోధుమలు, శెనగలు తెప్పిస్తారు. అడవికి వెళ్ళి ‘పిలోణీర్ ఏలే’ (దుసేరు తీగ)ను స్వయంగా తెచ్చి చిన్న బుట్టలను అల్లుతారు. తలారా స్నానం చేసి పుట్టమట్టిని సేకరిస్తారు. వీలుంటే ఈ మట్టికి మేక ఎరువును కలుపుతారు. దుసేరు తీగతో తాము అల్లిన చిన్న బుట్టలకు దండియాడి (మేరా మా భవాని), సేవాభాయా, తోల్జా భవాని, సీత్లా భవాని వంటి దేవతల పేర్లు పెడతారు. ముందుగా తండా పెద్దను ఆహ్వానించి ఒక బుట్టలో మట్టిని పోయించి గోధుమలు చల్లిస్తారు. అనంతరం ‘శీత్లాయాడి బొరాయీ తీజ్, బాయీ తారో పాలణో...’ అంటూ పాడుతూ మిగతా బుట్టల్లో యువతులు చల్లుతారు. తండా మధ్యలో ఒక చోట కట్టెలతో కాస్త ఎత్తులో డాక్లో(మంచె)ను ఏర్పాటు చేస్తారు. దానిపైన గోధుమలు చల్లిన బుట్టలను ఉంచి నీళ్లు పోస్తుంటారు. రేగుముళ్లకు గుచ్చటం... గోధుమలను బుట్టల్లో చల్లిన రోజు సాయంత్రం నానబెట్టిన శెనగలను ‘బోరడి’ (రేగు ముళ్లు)‘ఝష్కేరో’ (గుచ్చటం) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పూర్తి వినోద భరితమైన ఈ కార్యక్రమంలో శృంగార, కరుణ,హాస్య రసాలకూ ప్రాధాన్యముంటుంది. వదినలు రేగుముళ్ళకు శనగలను గుచ్చేటపుడు మరిది వరసవారు ముళ్లను కదిలిస్తూ ఏడిపించటం, అన్నలు సైతం చెల్లెళ్ళలకు శనగలు దొరకకుండా దాచి, ముళ్ళను అడ్డుగాపెట్టి సున్నితంగా ఏడిపించటం చివరకు వారు సోదరులను ప్రార్థించే పాటలు పాడటం, అందరూ సహకరించి శనగలు వారికందేలా చేయటం వినోదభరితంగా నిర్వహిస్తారు. ఈ రేగులను దండియాడి (మేరా మా భవాని), తోల్జా భవాని పండిస్తుందంటూ ‘కాచిగ పాకీయో బోరడియో.....’ అంటూ పాటలు పాడతారు. బావి నుంచి నీరు తెచ్చి తొమ్మిది రోజులపాటు బుట్టలపై చల్లుతూ తీజ్పట్ల తమ భక్తి, విశ్వాసాలను ప్రకటిస్తారు. పెళ్లికాని యువతులు తీజ్ రోజులలో శుచి, శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఉప్పు, కారం లేని శాఖాహారాన్ని స్వల్పంగా తీసుకుంటూ ఉపవాసం పాటిస్తారు. సామూహికంగా భవాని మాతకు పూజలు చేస్తారు. తీజ్ బుట్టలను భవాని దేవత పెట్టించిందని భావిస్తారు. ఏడో రోజు ‘ఢమోళి’ తీజ్ ఉత్సవంలో భాగంగా ఏడో రోజు చుర్మో ( రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను ‘మేరా మా భవాని’ కి సమర్పించే కార్యక్రమమే ‘ఢమోళి’. ప్రతి ఇంటి నుంచి కొంత బియ్యాన్ని సేకరించి కడావ్ (పాయసం) వండుతారు. అనంతరం తండా వాసులంతా తీజ్ దగ్గర చేరి ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఎనిమిదో రోజు సాయంత్రం యువతులు చెరువు నుంచి మట్టి తెస్తారు. ఆ మట్టితో ఇద్దరు వృద్ధస్త్రీలు ఆడ, మగ బొమ్మలను తయారు చేస్తారు. ఆ బొమ్మలకు పెళ్ళి జరిపించి సంబరం చేస్తారు. తరువాత ఆ బొమ్మలను ఊరేగింపుగా చెరువు వద్దకు తీసుకువెళ్ళి నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనినే ‘ఛ్వారీ ఛ్వారారో’ పండుగగా పిలుస్తారు. తొమ్మిదో రోజు ‘బోరడిఝష్కేరో’... తొమ్మిదో రోజు ‘బోరడిఝష్కేరో’ వేడుక నిర్వహిస్తారు. చివరిఘట్టంలో ‘తీజ్వేరాయెరో’ (నిమజ్జనోత్సవం) కరుణ రసపూరితంగా సాగుతుంది. ‘మాయమ్మ మాకు దూరమైపోతోంది.. మళ్ళీ ఎప్పుడొస్తావో..’ అంటూ యువతులు కన్నీటిపర్యంతమవుతారు. తండాపెద్ద వారిని ఓదారుస్తారు. యువతులు భవానిమాతను తులుస్తూ తీజ్నారు బుట్టలను కిందకు దింపి పూజలు చేసారు. దానిలోనుంచి కొంతనారును తెంపి తమ్ముళ్లు, బంధుమిత్రులకు చెవులలో పెడతారు. పెద్దతలకు తలపాగాలో దోపుతారు. బహుమానంగా యువతులకు కానుకలు ఇస్తారు. అనంతరం పూజలు చేసి బుట్టలను తలపై ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి సమీపంలోని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. చెరువు వద్దకు చేరగానే సోదరులు తమ సోదరి పాదాలను నీటితో కడిగి దండాలు పెట్టి ఆ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అనంతరం వారు తమ ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంరొట్టెలు, బెల్లంతో కలిపి చేసిన ‘చూర్మో’ ను వాయినంగా సమర్పిస్తారు. తీజ్ పాటలు పాడుతూ ఇంటికి చేరతారు. ఇంతటితో తీజ్ వ్రతం ముగుస్తుంది. తండాలను పంచాయతీలుగా గుర్తిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటం సహజంగానే తండాలలో ఆనందాన్ని నింపింది. బంజారాల బతుకమ్మ అయిన తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని బంజారాలు కోరుతున్నారు. -
ఈ నెల 15న భారీగా పెళ్లి ముహూర్తాలు
నారాయణఖేడ్: పంద్రాగస్టు అనగానే సాధారణంగా గుర్తుకొచ్చేది స్వాతంత్య్ర దినోత్సవం. జాతీయ పండుగ అయిన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రజలు వేడుకలా జరుపుకోవడం దేశభక్తిని చాటుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే వివాహం చేసుకుంటే వధూవరులకు ప్రత్యేకమైన రోజున పెళ్లి చేసుకున్నామన్న సంతోషం అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేని విధంగా శ్రావణ మాసంలో స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన వివాహ ముహూర్తం ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. 40 రోజుల విరామం అనంతరం పురోహితులు ఆగస్టు మాసంలో కొన్ని రోజుల్లో అధిక వివాహాలు చేసేందుకు ముహూర్తాలు పెట్టారు. గత నెల జూలై మాసంలో 27న శ్రావణ మాసం మొదలైనా మంచి ముహూర్తాలు లేవు. పురోహితులు ఈ నెల 11, 15, 20, 22వ తేదీల్లో వివాహాలకు ముహుర్తాలు నిర్ణయించారు. అందులో పంద్రాగస్టున జిల్లాలో వందలాది వివాహాలు జరగనున్నాయి. శ్రావణ మాసానికి ముందు ఆషాఢ మాసం ఉండడంతో మూఢాల కారణంగా వివాహాలకు మంచి ముహూర్తాలు లేక పెళ్లిళ్లు జరగలేదు. దీంతో ఉన్న నాలుగు తేదీల్లోనూ విశేష దినమైన ఆగస్టు 15న వివాహాలు నిర్వహించేందుకు పెద్దలు సైతం ఆసక్తి చూపించారని పురోహితులు చెబుతున్నారు. తన 15 ఏళ్ల పౌరోహిత్యంలో ఆగస్టు 15న పెళ్లి ముహూర్తం పెట్టలేదని ఖేడ్‌కు చెందిన పురోహతుడు మలమంచి మనోహరశర్మ తెలిపారు. ఈ ఏడాది మాత్రమే ఆగస్టు 15న శ్రావణ శుక్రవారం కారణంగా భారీగా ముహూర్తాలు పెట్టానని వివరించారు. శ్రావణ మాసం తర్వాత మళ్ళీ మూఢాలు వస్తుండడంతో ఈ నెలలోనే వివాహాది శుభకార్యాలు చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక 11,15,20,22 తేదీల్లో వివాహ జరిపేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఫంక్షన్ హాల్లు బుక్ అయిపోయాయి. దీంతో ఫంక్షన్ హాల్లు లభించని వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, పుష్యం, మాఘం, పాల్గుణం మాసాల్లో ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెలలోనే వివాహాలు చేసేందుకు అందరూ సిద్ధమయ్యారు. దీంతో జిల్లా కేంద్రం సంగారెడ్డితో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వేలాదిగా వివాహాలు జరగనున్నాయి. దీంతో ఫంక్షన్ హాల్‌లతో పాటు బ్యాండు, సన్నాయి, పురోహితులు, క్యాటరింగ్, డెకరేషన్, వాహనాలు, ఫోటో, వీడియోగ్రాఫర్, టెంట్‌హౌస్, బంగారు, వస్త్ర దుకాణాలకు గిరాకీ పెరగనుంది. -
శ్రావణ శోభ
సాక్షి, ముంబై : హిందువుల పవిత్రమైన శ్రావణ మాసం శనివారం ప్రారంభమైంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ముంబైతోపాటు రాష్ట్రంలోని దేవాలయాలు ముఖ్యంగా శివాలయాలన్నీ ముస్తాబు అయ్యాయి. అనేక మంది ఉపవాస దీక్షలు చేయడంతోపాటు తమ ఇష్టదైవాలను ఎంతో నిష్టతో ఆరాధిస్తారు. ఈ మాసంలో దేవిదేవతలను పూజిస్తే తమ కోరికలు త్వరగా నేరవేరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ సారి శ్రావణమాసంలో అయిదు సోమవారాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలను గురించి తెలుసుకుందాం... ఐదు క్షేత్రాల ప్రాశస్త్యం దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అయిదు మహారాష్ట్రలోనే ఉండడం విశేషం. వీటిలో ఔండా నాగనాథ్, భీమాశంకర్, గశ్నేశ్వర్, పరళి వైద్యనాథ్, త్రయంబకేశ్వర్ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. త్రయంబకేశ్వర్.... జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. నాసిక్ జిల్లాలో ఉన్న ఈ త్రయంబకేశ్వర్‌లోని జ్యోతిర్లింగానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముఖాలున్నాయి. జ్యోతిర్లింగాన్ని మూడు త్రిమూర్తుల ముఖాలున్న స్వర్ణ కిరీటంతో అలంకరించారు. పాండవుల కాలం నుంచి ఈ కిరీటాన్ని అలంకరిస్తున్నట్లు స్థానికంగా చెబుతారు. ఈ దేవాలయాన్ని నల్లరాతితో అద్భుత రీతిలో నిర్మించారు. మహా శివరాత్రి, శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజలను నిర్వహిస్తారు. భీమశంకర్.... భీమశంకర్ దేవాలయాన్ని 13 వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలనుసారం తెలుస్తోంది. ఈ దేవాలయానికి ముందు భాగంలో ఉన్న మండపాన్ని నానా పద్‌నివాస్ 18 శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. భీమాశంకర్ దేవాలయాన్ని నాగరా పద్ధతిలో రూపొందించారు. అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమాశంకర్ గర్భ గుడి కూడా కిందికి ఉంటుంది. ఈ క్షేత్రం పుణేకు 128 కిమీ దూరంలోఉంది. భీమా నదీ తీరంలో ఉండడంతోనే భీమాశంకర్ క్షేత్రంగా పేరువచ్చిందని పేర్కొంటారు. గశ్నేశ్వర్....... ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఈ గశ్నేశ్వర్ క్షేత్రాన్ని ఇండోర్‌ను పాలించే అహల్యాబాయి హోల్కర్ నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. గశ్నేశ్వర్ క్షేత్రాన్ని గశ్నేశ్వర్, కుస్నేశ్వర్ క్షేత్రమని కూడా పిలుస్తారు. కుసుమ అనే మహిళ తన కొడుకు ప్రాణాలను రక్షించమని వేడుకుంటూ శివలింగాన్ని చేతులో పట్టుకొని కోనేరులో మునిగి శంకరుడిని గూర్చి ఘోర తపస్సు చేసింది. ఆది దేవుడు ప్రత్యక్షమై ఆమెకు పుత్ర భిక్ష పెట్టాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి గశ్నేశ్వర క్షేత్రంగా పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఔండా నాగనాథ్ ... ఈ క్షేత్రం రాష్ట్రం లోని హింగోళి జిల్లాలో ఉంది. ఔండా నాగనాథ్ క్షేత్రాన్ని గూర్చి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. సంత్ జ్ఞానేశ్వర్, విసోబా కేచర, వార్కరీ (భక్తుల సముదాయం) కలిసి భజనలు చేస్తుండగా నాగనాథ్ గుడిలో పూజారి బయటకువచ్చి పూజకు అంతరాయం కలుగుతోందని దూరంగా వెళ్లండని చెప్పాడు. వారు గుడి వెనకకు వెళ్లి తమ భజనలను కొనసాగిస్తారు. వారి భజనలకు ముగ్ధుడెన శివుడు హఠాత్తుగా గుడిని వారివైపునకు తిప్పి భజనలు వింటాడు. ఈ కారణంగా ఈ క్షేత్రంలో నంది దేవాలయం వెనుక భాగంలో దర్శనమిస్తోంది. పర్లీ వైద్యనాథ్... బీడ్ జిల్లాలో ఉన్న పర్లీ వైద్యనాథ్ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారనేది కచ్చితంగా తెలియకపోయినా క్రీ.శ.1706 లో అహల్యాదేవి హోల్కర్ పునః నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. పర్లీ వైద్యనాథ్ చుట్టు పక్క ప్రాంతాలు మొత్తం అడవులు, కొండలు, నదులు, ఉపయోగకరమైన ఔషధ మొక్కలతో ఉంటుంది. ఈ కారణంగా పర్లీ జ్యోతిర్లింగ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. పర్లీ వైద్యనాథ్ క్షేత్రానికి సంబంధించి పురాణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.