
వారం... పర్వం
నాగపంచమి/గరుడ పంచమి: నాగారాధనకు సంబంధించిన ముఖ్యరోజులలో కార్తీకశుద్ధ పంచమి ‘గరుడ పంచమి’ లేదా ‘నాగ పంచమి’ గా ప్రసిద్ది. కొన్నిప్రాంతాలలో నాగపంచమిని శ్రావణమాసంలో ఆచరిస్తారు. గరుత్మంతుడు సూర్యుడికి రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందుకే ఆయనకి సుపర్ణుడని పేరు.
గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే... ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉన్న మూర్తి కనిపిస్తుంది. అంటే విష్ణుమూర్తి తనను ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసమే.
నాగులనుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లలను కా పాడుకొనేందుకు చేసే పూజ నాగపంచమి, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.
గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యం పోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మనికొన్నిప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృ ప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ/నాగ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుందని నమ్ముతారు.
ఇదే రోజున నాగపంచమి వ్రతం చేసుకునేవారు నాగుల ఆకారాన్ని ఇంటి గోడలమీద తీర్చిదిద్ది పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. నాగారాధన వల్ల సర్పదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఈరోజున చేసే నాగారాధన వల్ల చర్మవ్యాధులు, చెవి సంబంధిత రోగాలు తొలగుతాయని కూడా ప్రతీతి.
మహనీయుల మాటలు
→ ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించాలి. ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించాలి. ఏది మనకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చేసుకోవాలి.
→ మంచి ఆలోచనలతో మనసు నింపుకో మంచి పనులతో ప్రతిష్ట పెంచుకో మంచి పలుకులతో మన్ననలు అందుకో వీటి అన్నిటితో అందరిని కలుపుకొని పో
→ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ భయపడేవారు ఏమీ సాధించలేరు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.
→ బయటకు కనిపించే రంగు,రూ పాన్ని చూసి ఎవ్వరినీ అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచేంతవరకూ కాకి, కోయిల రెండూ ఒకేలా ఉంటాయి.
→ అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు, తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞాన వంతులు.‘