
కనకదుర్గమ్మకు ఘనంగా చండీ హోమం
అన్నవరం: రత్నగిరి తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూల సందర్భంగా బుధవారం ఘనంగా చండీహోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీహోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. చండీ హోమం, పూజ కార్యక్రమాలను వేద పండితులు సంతోష్ అవధాని, ఆలయ అర్చకుడు చిట్టెం గోపీ, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ నిర్వహించారు. నలుగురు భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి హోమంలో పాల్గొన్నారు.
ఆర్టీసీలో లైంగిక వేధింపుల
ఫిర్యాదుపై విచారణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ ఆర్టీసీ డిపోలో కండక్టర్లుగా పనిచేస్తున్న మహిళలపై డిపోకు చెందిన ఒక ఉద్యోగి లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విజయవాడ నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేసేందుకు బుధవారం వచ్చారు. అయితే ఫిర్యాదు దారు పేరు లేకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న అందరి మహిళలను ఉన్నతాధికారులు విచారించారు. తాము ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని మహిళా కండక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొందరు వ్యక్తులు కావాలని ఆర్టీసీ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు అక్కడ ఉద్యోగులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నివేదిక ఉన్నతాధికారులు సమర్పిస్తామని చెప్పారు.
రైల్వే ఉద్యోగుల ధర్నా
సామర్లకోట: రైల్వే ఉద్యోగులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఉద్యోగులు బుధవారం ధర్నా నిర్వహించారు. రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షన్ ప్రతీ కార్మికుని హక్కు అని, దాని సాధనకు కార్మికులందరూ ఐక్యంగా కలిసి రావాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కోరారు. రైల్వే ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెలను అమలు చేయాలని నినాదాలు చేశారు. సంఘ చైర్మన్ టి.ఈశ్వరరావు, వర్కింగ్ చెర్మన్ రామకృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీ విశ్వప్రసాద్, వైస్ చైర్మన్ గోపాలరెడ్డి, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ గౌరవ అధ్యక్షుడు కెవీ వెంకటేశ్వరరావు, ఇంజినీరు రామసుబ్బారావు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మకు ఘనంగా చండీ హోమం