3.15 లక్షల పశువులకు గాలికుంటు వ్యాక్సిన్‌

విలేకర్లతో మాట్లాడుతున్న సూర్యప్రకాశరావు - Sakshi

జగ్గంపేట: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3.15 లక్షల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా పశు సంవర్ధక అధికారి సూర్యప్రకాశరావు తెలిపారు. వచ్చే నెల 1 నుంచి నెలాఖరు వరకూ ఈ వ్యాక్సినేషన్‌ చేపడతామని చెప్పారు. జగ్గంపేట పశువుల ఆసుపత్రికి శుక్రవారం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. వ్యాకినేషన్‌ విజయవంతానికి మండలానికి 2 బృందాల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి అదుపులోకి వచ్చిందని, దీనికోసం 64,500 డోసుల వ్యాక్సిన్‌ పశువులకు వేశామని చెప్పారు. పందుల్లో స్వైన్‌ ఫీవర్‌ అరికట్టడానికి ఇప్పటికే 1,950 డోసుల వ్యాక్సిన్‌ వేశామని, మరో 2 వేల డోసులు ఆయా మండలాల్లోని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని వివరించారు. రైతుభరోసా కేంద్రాల్లో పశువుల మేతను కేజీ రూ.6.50కు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జగ్గంపేట పశు సంవర్ధక అధికారి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం శుక్రవారం కిటకిటలాడింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై 50కి పైగా వివాహాలు జరిగాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు తమ బంధుమిత్రులతో కలసి స్వామివారి ఆలయానికి తరలి వచ్చారు. వీరు వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారని అధికారులు అంచనా వేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. వ్రతాలు 3 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని సాధారణ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. నిత్యాన్న ప్రసాద పథకంలో 5 వేల మంది భక్తులకు భోజనం పెట్టారు.

Read latest Kakinada News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top