● ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో కరువు
● మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
● ఇందువాసిలో వలస కూలీల కుటుంబాలకు పరామర్శ
గట్టు: పాలమూరు ప్రజలకు కరువు తెచ్చి, రైతులను కన్నీరు పెట్టించడంతో పాటు బేడీలు వేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం గట్టు మండలం ఇందువాసి గ్రామంలో ఆయన పర్యటించారు. కర్ణాటకలోని యాదగిరి ప్రాంతానికి వలస వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏసేపు, నాగన్న కుటుంబాలతో పాటు క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇందువాసికి చెందిన దళిత వలస కూలీలు మృతి చెందితే సీఎం రేవంత్‌రెడ్డికి పట్టదని.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు పరామర్శించేందుకు తీరక లేదంటూ ఆరోపించారు. కనీసం కలెక్టర్, ఇతర అధికారులు కూడా బాధిత కుటుంబాలను ఇప్పటికి దాకా పరామర్శించక పోవడం దారుణమన్నారు. ఓవైపు తుంగభద్ర, మరోవైపు కృష్ణానదులు ఉన్నా ఇందువాసి గ్రామానికి సాగునీరందని దుస్థితి ఉందన్నారు. అందుకే ఇక్కడ దళిత కుటుంబాలు వలస బాట పట్టాయని ఆరోపించారు. ఎండుతున్న పంటలను చూడలేక జూరాల వద్ద ఆందోళనకు దిగితే ప్రభుత్వం రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి, బేడీలు వేయిస్తోందని ఆరోపించారు. సాగునీరు లేకపోవడం, కరెంటు సక్రమంగా ఇవ్వక పోవడంతో కరువు వచ్చి వలసలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూలీలకు రూ. 12వేల సాయం ఏమైందని ఆయన ప్రశ్నించారు. కూలీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దగా చేసిందని ఆరోపించారు. ఎల్‌నినో పేరుతో ప్రభుత్వం ప్రజలు, రైతులను భయపెడుతోందని ఆరోపించారు. రైతులకు ఉచితంగా విత్తనాలు అందించడంతో పాటు రైతుభరోసా నిధులు అందించాలని డిమాండ్ చేశారు.
● గట్టు సబ్‌స్టేషన్ నుంచి వ్యవసాయానికి అందిస్తున్న కరెంటుకు సంబంధించిన రికార్డులను హరీశ్‌రావు పరిశీలించారు. 7:16 గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తించారు. మద్యలో 3 పర్యాయాలు కరెంట్ కట్ చేసినట్లు స్పష్టమైంది. అక్కడి నుంచి రాయపురం స్టేజీ వద్ద ఎండిన వరిపంటను ఆయన పరిశీలించి, రైతుతో మాట్లాడారు. కరెంట్ సక్రమంగా లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నట్లు రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయానికి పగలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని.. అదీ కూడా మధ్య మధ్యలో కోతలు పెడుతున్న కారణంగా పంటలను కాపాడుకోలేక పోతున్నట్లు రైతులు వాపోయారు. కాగా, రాయాపురంలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కోసం 60 ఎకరాలు సేకరిస్తున్నారని.. ఈ భూములను నమ్ముకుని తాము బతుకుతున్నామని.. సాగు భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడుతామని, రైతులు అధైర్యపడొద్దని సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.


