అయిజ: స్థానిక మున్సిపాలిటీలో ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు 19వ వార్డు కౌన్సిలర్ షేక్షావలి ఆచారి అన్నారు. బుధవారం అయిజలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ ఎస్ హయాంలో అయిజ మున్సిపాలిటీలో భవన నిర్మాణాల అనుమతుల విషయంలో రూ. వందల కోట్లు అవినీతి చేశారన్నారు. గృహ నిర్మాణం పేరు తో అనుమతులు తీసుకొని కమర్షియల్ దుకాణాల నిర్మాణం చేపట్టిన ముగ్గురి భవనాలను నాలుగు రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ సీజ్ చేశారని తెలిపారు. అయితే సీజ్ చేసిన భవనాలను తిరిగి తెరిపించేందుకు ఎంపీ మల్లు రవి కలెక్టర్పై ఒత్తిడి తేవడంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు సీడీఎంఏకు లెటర్ రాశారని ఆరోపించారు. మంత్రి, ఎంపీ తీరుతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఎంతో బాధ కలిగించాయన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకుల చిట్టా విప్పుతుంటే.. ఇక్కడ మాత్రం పార్టీ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. మరోవైపు ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఫోన్చేస్తే స్పందించడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనతో పాటు పార్టీ కౌన్సిలర్లు సంతోషమ్మ, యుగంధర్, మద్దిలేటి, రాధ మ్మ, ఫర్మిన్ తబస్సుం, మైనర్ బాబు పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహశ్కుమార్గౌడ్కు లేఖ పంపినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కౌన్సిలర్ మద్దిలేటి, మహ్మద్ బాషా ఉన్నారు.


