నడిగడ్డలో మరో మార్కెట్‌యార్డు ఏర్పాటు
అన్నదాతలకు ప్రయోజనం..
● ప్రిలిమనరీ నోటిఫికేషన్‌లో అయిజకు చోటు
● ఇప్పటికే అలంపూర్ మార్కెట్‌యార్డుకు సబ్‌యార్డుగా కొనసాగింపు
● పూర్తిస్థాయి మార్కెట్‌యార్డు
ఏర్పాటుతో మూడు మండలాల
రైతులకు తీరనున్న తిప్పలు
గద్వాలవ్యవసాయం: నడిగడ్డలో మరో మార్కెట్‌యార్డు ఏర్పాటు కానుంది. అలంపూర్‌కు సబ్‌యార్డుగా ఉన్న అయిజలో కొత్తగా పూర్తిస్థాయి మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమనరీ నోటిఫికేషన్‌లో అయిజ మార్కెట్‌యార్డును చేర్చింది. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అయిజలో నూతన మార్కెట్‌యార్డు ఏర్పాటు కానుంది. ఈ యార్డు ఏర్పాటుతో అన్నదాతలకు పలు ప్రయోజనాలు చేకూరనున్నాయి.
వ్యవసాయమే ప్రధాన జీవనాధారం..
జిల్లాలో జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పరిధిలో ఏడు రిజర్వాయర్లు, 120 వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి. దీంతో ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఏటా వానాకాలంలో 1.27లక్షల హెక్టార్లు, యాసంగిలో 48వేల హెక్టార్లలో వరి, పత్తి, కంది, ఆముదం, వేరుశనగ, మొక్కజొన్న, ఎండుమిర్చి తదితర పంటలను రైతులు పండిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు గద్వాల, అలంపూర్ మార్కెట్‌యార్డులు ఉండగా.. అలంపూర్ మార్కెట్‌యార్డుకు అయిజ సబ్‌మార్కెట్‌గా ఉంది.
త్వరలో ఫైనల్ నోటిఫికేషన్..
అలంపూర్ మార్కెట్‌యార్డుకు సబ్‌యార్డుగా ఉన్న అయిజలో కొత్తగా పూర్తిస్థాయి మార్కెట్‌యార్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రిలిమనరీ నోటిషికేషన్ జారీ చేసింది. త్వరలోనే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అయిజ, వడ్డేపల్లి, రాజోళి మండలాల పరిధితో కొత్త మార్కెట్‌యార్డు ఏర్పాటు కానుంది. అలంపూర్ యార్డు ఉద్యోగుల్లో కొంతమందిని వైబర్‌కేట్ చేసి ఇక్కడికి బదిలీ చేయనున్నారు. ఆ తర్వాత యార్డు నిర్వహణ వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. కాగా, అయిజలో ప్రస్తుతం ఉన్న యార్డు భవనం కొంత శిథిలావస్థకు చేరుకోగా, మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 35లక్షలు మంజూరు చేసింది. యార్డు ఏర్పాటైన తర్వాత పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఖరీదుదారులు, కమీషన్‌దారులు (ట్రేడర్స్) ముందుకొస్తే, నిబంధనల మేరకు వారికి లైసెన్స్‌లు ఇస్తారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో దుకాణాలు సైతం ఏర్పాటు అవుతాయి. ఇదిలా ఉంటే, అయిజలో ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టు అలంపూర్ యార్డు పరిధి నుంచి అయిజ యార్డు పరిధిలోకి వస్తుంది. అదే విధంగా అయిజలో ప్రతి గురువారం పశువుల సంత కొనసాగుతోంది. గతేడాది ఈ సంత నుంచి రూ. 6.47లక్షల ఆదాయం వచ్చింది. 2023–24లో రూ. 20లక్షలు, 2024–25లో రూ. 21.61లక్షల ఆదాయం సమకూరింది. కొత్తగా వచ్చే ట్రేడర్స్‌తో పాటు ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టు, పశువుల సంత కొత్తగా ఏర్పాటయ్యే అయిజకు ఆదాయ మార్గాలుగా ఉండనున్నాయి.
జిల్లాలోని గద్వాల మార్కెట్‌యార్డు రాష్ట్రంలోనే ప్రసిద్దిగాంచింది. స్థానిక రైతులతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఇక అలంపూర్‌లో రోజువారీ కొనుగోళ్లు ఉండవు. రైతులు పంట ఉత్పత్తులు తీసుకొచ్చినప్పుడు మాత్రమే అక్కడి ట్రేడర్స్ కొనుగోలు చేస్తుంటారు. యార్డు పరిధిలోని మూడు చెక్‌పోస్టుల నుంచి ప్రధానంగా ఆదాయం సమకూరుతోంది. మార్కెట్‌యార్డులో రైతుల అవసరాలు, డిమాండ్ మేరకు మాత్రమే కంది, పప్పుశనగ తదితర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే అయిజ మండలంలో వరి, పత్తి, కంది తదితర పంటలను విస్తారంగా పండిస్తారు. పంట ఉత్పత్తులను విక్రయించడానికి ఇక్కడి రైతులు 30 కి.మీ. దూరంలోని గద్వాల యార్డుకు లేదా అలంపూర్, రాయచూరు ప్రాంతాలకు వ్యయ, ప్రయాసాలకోర్చి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడే యార్డు ఏర్పాటుతో అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా అయిజ పక్కనే ఉన్న రాజోళి, వడ్డేపల్లి మండలాల రైతులకు సైతం ఇబ్బందులు తీరనున్నాయి.


