గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 18 ఫిర్యాదులు అందాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. ఆస్తి తగాదా, మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కారం నిమిత్తం ఆయా స్టేషన్ అధికారులకు సిఫారసు చేశారు. ఫిర్యాదులపై పూర్తి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
అయిజ: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంటర్‌ప్రెస్యూర్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఈడీసీ) మేనేజర్ శ్యామల సూచించారు. సోమవారం అయిజ చేనేత సహకార సంఘం కార్యాలయంలో కార్మికులకు చేనేత క్లస్టర్ల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలు పొందే విధానం, వాటితో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను చేనేత కార్మికులు సద్వినియోగించుకోవాలని ఆమె సూచించారు. సమావేశంలో ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ ఈన్వేష్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వీరన్న, ఉపాధ్యక్షుడు షర్ఫుద్దీన్, కార్యదర్శి పసలాది బసవరాజు, కోశాధికారి వెంకటేశ్ ఉన్నారు.
అసిస్టెంట్ కమాండెంట్‌కు పతకాలు
ఎర్రవల్లి: తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పదో బెటాలియన్ గెజిటెడ్ అధికారులు పాల్గొని పతకాలు సాధించడం అభినందనీయమని ఇన్‌చార్జి కమాండెంట్ ఆదినారాయణ అన్నారు. బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీను బ్యాడ్మింటన్ సింగిల్స్ మెన్ (40 ప్లస్) విభాగంలో గోల్డ్ మెడల్, సింగిల్స్ మెన్ (50 ప్లస్) విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కమాండెంట్ కార్యాలయంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనును ఆయన ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధిరెడ్డి, వెంకటరమణ, ఆర్‌ఐలు ఆర్పీసింగ్, శ్రీనివాస్, రాజేశం పాల్గొన్నారు.
ఆర్డీఎస్‌ను బ్యారేజ్‌గా మార్చాలి
అలంపూర్: ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు ఆర్డీఎస్‌ను బ్యారేజ్‌గా మార్చాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి నియోజకవర్గ జేఏసీ చైర్మన్ రామ్మోహన్ డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యలపై చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనంతరం జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ.. ఆర్డీఎస్‌ను బ్యారేజీగా మార్చడం ద్వారా ఆయకట్టుకు రావాల్సిన నీటిని సాధించవచ్చన్నారు. అలాగే ఆర్డీఎస్ కాల్వలను ఆధునికీకరించడంతో పాటు నెట్టెంపాడు 99, 100 ప్యాకేజీల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. చిన్నోనిపల్లి, గూడెందొడ్డి రిజర్వాయర్లను ఆర్డీఎస్ కాల్వలకు అనుసంధానించాలని.. మారమునగాల – ప్రాగటూరు వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి, ఆర్డీఎస్ 32ఏ డిస్ట్రిబ్యూటర్‌కు అనుసంధానం చేయాలన్నారు. తద్వారా దాదాపు 30వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. గొందిమల్ల వద్ద బ్యారేజీ నిర్మాణంతో పాటు చిన్నతాండ్రపాడు చెరువు పూడికతీత, ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు హనుమంతు, రైతు సంఘం జిల్లా నాయకుడు ఈదన్న, ఉండవెల్లి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు లోకేశ్వర్ రెడ్డి, సర్పంచ్ గొంగోళ్ల ఈశ్వర్, నర్సింహులు, శేషన్‌గౌడ్, రాఘవేంద్ర, గోపాల్‌రెడ్డి ఉన్నారు.


