‘మల్లమ్మకుంట’కు మార్గం సుగమం | - | Sakshi
Sakshi News home page

‘మల్లమ్మకుంట’కు మార్గం సుగమం

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

● భూ నిర్వాసితులకు రూ.20లక్షల

పరిహారం

● కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల: మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో రైతుల సహకారం అభినందనీయమని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలిసి రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై తనగల గ్రామ రైతులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి చర్చించామన్నారు. కన్సెంట్‌ అవార్డు కింద మొదటి విడతగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పగా.. రైతులు మాత్రం రూ. 16.50లక్షల చొప్పున ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. అయితే కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.20లక్షల పరిహారాన్నే ఇక్కడ కూడా చెల్లించనున్నట్లు తెలిపారు. పరిహారంతో పాటు బాధిత రైతులకు ఇందిరమ్మ ఇళ్లు, రిజర్వాయర్‌లో చేపలవేట హక్కులు కూడా కల్పించనున్నట్లు చెప్పారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరిస్తున్న రైతులందరికీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆర్డీఎస్‌ పూర్తి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణంపై, భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లింపులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం తనగల రైతులు కలెక్టర్‌, మాజీ ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. సమావేశంలో అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్డప్ప, ఎస్‌డీసీ కృష్ణ, తనగల సీతారామిరెడ్డి ఉన్నారు.

● సమాజంలో వృద్ధుల అనుభవాలు నేటి తరానికి మార్గదర్శకమని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. స్థానిక బాలభవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన వృద్ధులను సన్మానించి, చట్టాలపై ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు గిరిజా కల్యాణి, సునంద, సంధ్యా కిరణ్మయి, అయ్యపురెడ్డి, మోహన్‌రావు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

● ప్రజావాణి ఆర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ అన్నారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్‌, నర్సింగ్‌రావుతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 44 అర్జీలు అందాయి. కార్యక్రమంలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement