అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ అన్నారు. అమరచింతలోని పద్మశాలి ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు లొంగిపోయి.. వ్యవసాయ ఉత్పత్తులను జీరో ట్యాక్స్‌తో దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించడం దారుణమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించి.. పారిశ్రామిక యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బకొట్టి.. పెట్టుబడిదారుల ఖజానా నింపడమే ప్రధాని మోదీ తన కార్తవ్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న దేశవ్యాప్తంగా చేపట్టనున్న జైల్‌భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


