అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు

Aug 4 2026 12:59 AM | Updated on Aug 4 2026 12:59 AM

గద్వాల: ప్రజావాణికి వచ్చే అర్జీలను పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను హెచ్చరించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజల సమస్యలను స్వయంగా కలెక్టర్‌ తెలుసుకొని వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 70 అర్జీలు అందగా.. పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అనేక ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి బుధవారం ఫిర్యాదులపై సమీక్షించి.. పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే సోమవారంలోగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించాలని.. లేనిచో షోకాజ్‌ నోటీసులను జారీ చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా మండలాల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి.. పరిష్కార మార్గం చూపాలని సూచించారు. అనంతరం ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ, ఇతర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. విద్యాలయాలు, వసతిగృహాల్లో సంబంధిత అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి మండలంలో మూడు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నామని.. అక్కడి సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతు పనులు సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింగ్‌రావు, మధుమోహన్‌, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement