గద్వాల క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని గద్వాల – అయిజ, జమిచెడ్ ప్రధాన రహదారుల్లో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించారు. రాత్రివేళ బయట తిరుగుతున్న వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. నంబర్ ప్లేట్ లేని ఓ కారును స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమైన నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మద్యం మత్తులో వాహనదారులు చేస్తున్న ప్రమాదాలను కట్టడి చేయాలనే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసినట్లు వివరించారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు.


