గద్వాల: క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఈ నెల 10న చేపట్టనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన హమాలీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కార్మికలోకం సిద్ధం కావాలన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటయోధుల స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులు, మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాతంత్ర వాదులు సమష్టి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. 12ఏళ్ల బీజేపీ పాలనలో కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసి.. శ్రమదోపిడీకి ద్వారాలు తెరిచారని విమర్శించారు. కనీస వేతనాలు లేక కార్మికవర్గం అల్లాడుతుంటే.. కార్మిక చట్టాల పేరుతో కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు కుట్రలు చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే జైల్‌భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో తిరుపతన్న, లక్ష్మన్న, రామకృష్ణ, బాలకృష్ణ, నర్సింహ, ఆంజనేయులు, రంగన్న, వీరేశ్, నర్సింహ పాల్గొన్నారు.


