గద్వాల: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా రూపొందించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అన్నారు. ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అదనపు ముఖ్య అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ సరిగ్గా పనిచేయని బీఎల్‌వోల స్థానంలో కొత్తవారి నియామకం చేపట్టాలన్నారు. సంబంధిత మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలతో సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 78.52 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, జిల్లావ్యాప్తంగా గద్వాల మండలంలో చాలా తక్కువ మ్యాపింగ్ జరిగిందని వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


