దాహం.. దాహం | - | Sakshi
Sakshi News home page

దాహం.. దాహం

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

గద్వాల: వేసవికాలం మొదలు అయ్యిందంటే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు గుర్తుకు వచ్చేది తాగునీటి సమస్య. గతంతో కంటే ఈసారి వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా పనులపై జనాలు బయటకు వెళ్లాలంటే అల్లాడిపోతున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో తాగునీటి సమస్య మొదలైంది. గద్వాల మున్సిపాలిటీలో కృష్ణానది, జమ్ములమ్మ రిజర్వాయర్‌ నుంచి, అదేవిధంగా కొత్తహౌసింగ్‌బోర్డు, దౌదర్‌పల్లి వంటి శివారు కాలనీలలో మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా చేస్తుండగా.. మిగిలిన అలంపూర్‌, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలలో మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా నాలుగు మున్సిపాలిటీలలోని శివారు కాలనీలలో తాగునీటి సమస్య అధికంగా కనిపిస్తుంది. ఈ కాలనీలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోచ్చు.

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులు ఉన్నాయి. పట్టణ జనాభా సుమారు 65 వేలు. పట్టణానికి కృష్ణానది, జమ్ములమ్మ రిజర్వాయర్‌ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే పట్టణంలో శివారు కాలనీలైన బీసీ కాలనీ, రెండవ రైల్వేగేటు కాలనీ, పిల్లిగుంట్ల, దౌదర్‌పల్లి, హమాలీకాలనీ తదితర కాలనీలలో తాగునీటి సమస్య తలెత్తుతుంది. ఇటీవల కాలంలో పిల్లిగుంట్ల కాలనీలో తాగునీటి సమస్య ఉందని కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కాలనీలలో కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండగా.. ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రమవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

తరుచుగా మరమ్మతు..

వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులున్నాయి. మొత్తం జనాభా 13,267. ఈ మున్సిపాలిటీలో మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేస్తుండగా.. ప్రధానంగా 9వ వార్డులో కేవలం 30– 45 నిమిషాలు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తుండడంతో వార్డు ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ వార్డుకు సరఫరా చేసే తాగునీటి పైపులైన్‌ తరచూ మరమ్మతులకు గురవుతుండడం కూడా తాగునీటి సమస్యకు కారణంగా మారుతున్నాయి.

మిషన్‌ భగీరథ ద్వారా..

అలంపూర్‌ మున్సిపాలిటీలో 10 వార్డులుండగా మొత్తం జనాభా 12,654. ఈ మున్సిపాలిటీలో మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండగా ప్రధానంగా 5, 7, 8 వార్డులలో వేసవిలో తరచూ తాగునీటి సమస్య ఎదురవుతుంది. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

వేసవి నేపథ్యంలో తాగునీటి కోసం జనాల అవస్థలు

జిల్లాలోని మున్సిపాలిటీలలో

శివారు కాలనీల్లో తాగునీటి కష్టాలు

ట్యాంకర్ల ద్వారా సరఫరా

చేస్తున్నా సరిపోని వైనం

గద్వాల మినహా మిగతా చోట్ల మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా

Advertisement
 
Advertisement
Advertisement