గద్వాల క్రైం: నిత్యం వేలాది ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ఆర్టీసీ సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడం.. ఆర్టీసీ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. జిల్లాకేంద్రమైన గద్వాల జిల్లా నుంచి హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, కర్ణాటక తదితర దూర ప్రాంతాలకు గతంలో రోజు 70వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో లక్ష మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇక పాఠశాలలు, కళాశాలలు కొనసాగే సమయంలో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుండటంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నిత్యం అనేక సమస్యలతో విధుల నిర్వహణ భారంగా మారుతోందని వాపోతున్నారు.
సామర్థ్యానికి మించి..
గద్వాల ఆర్టీసీ డిపోలో 103 బస్సులు ఉండగా.. అందులో ఆర్టీసీకి చెందినవి 56, అద్దె బస్సులు 47 ఉన్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 50 – 60 మంది వరకు ప్రయాణింవచ్చు. గతంలో 10 నుంచి 20 మంది అదనంగా ప్రయాణించే వారు. ప్రస్తుతం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 80 నుంచి 100 మంది ప్రయాణిస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వయసు పైబడిన వారు, చిన్నారులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ సిబ్బంది సైతం సతమతమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడం.. కాలం చెల్లిన బస్సులతో డ్రైవర్లు, కండక్టర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
పని ఒత్తిడితో పొరపాట్లు..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఏ బస్సులో చూసినా మహిళలే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. సీట్ల కోసం మాటల యుద్దాలు, పిడిగుద్దుల వరకు వెళ్తున్నారు. ఈ పరిస్థితులు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ప్రయాణికుల రద్దీతో బస్సు ఆలస్యం కావడం.. కేఎంపీఎల్ రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. మరోవైపు కండక్టర్లు సైతం టికెట్లు ఇచ్చే సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. జీరో టికెట్ ఇచ్చే క్రమంలో తప్పిందాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు.
అధికారుల టార్గెట్..
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. ప్రస్తుతం పని గంటల్లో ఎలాంటి నిబంధన లేదు. దూర ప్రాంతాలకు వెళ్లిన క్రమంలో రాను, పోను 400 కి.మీ. డ్యూటీ చేయాల్సిందే. మరోవైపు అధికారుల టార్గెట్‌తో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. డ్రైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ ఇవ్వడం.. కేఎంపీఎల్ ఎందుకు రాలేదని అధికారుల ప్రశ్నలతో సతమతమవుతున్నారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కార్మిక యూనియన్లు లేకపోవడంతో సిబ్బందికి ఇష్టానుసారంగా డ్యూటీలు వేయడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు.
ప్రయాణికుల రద్దీతోఉద్యోగుల సతమతం
మహాలక్ష్మి పథకంతో పెరిగిన ఒత్తిడి
నానాటికీ భారంగా
మారుతున్న విధుల నిర్వహణ
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా
బస్సు సర్వీసులు లేక అవస్థలు


