ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. మంగళవారం గద్వాల మండలం చెనుగోనుపల్లి, అనంతపురం–1, బసల్‌చెర్వు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉండటం, లారీలు తక్కువగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్‌.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రానికి రోజు కనీసం నాలుగు లారీలు పంపించాలని తెలిపారు. రైతులు ఎండలో ఎక్కువసేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం ఎక్కువగా వచ్చిన కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చి.. సమీప మిల్లులకు పంపడం ద్వారా సమయం వృథా కాదన్నారు. అదే విధంగా గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. కేంద్రంలో ఉన్న ధాన్యం నిల్వలు, తేమశాతం, పంపిన లోడ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట అడిషనల్‌ డీఆర్డీఓ శ్రీనివాస్‌, డీపీఎం అరుణ, ఏఈఓ ఉషశ్రీ, రవి ఉన్నారు.

● రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల 31వ తేదీ వరకు సభ్యత్వ నమోదును సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను కలెక్టరేట్‌లో ప్రత్యేక డాటా సెంటర్‌ ఏర్పాటు చేయడంతో పాటు అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావును ఉపాధ్యక్షుడిగా, ప్రత్యేక అధికారిగా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ అధికారి వేణుగోపాల్‌, జిల్లా ఉపాధి కల్పన అధికారి చరణ్‌ దీప్‌ను నోడల్‌ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. సభ్యత్వ రుసుం పేట్రన్‌ రూ. 25వేలు, వైస్‌ పేట్రన్‌ రూ. 12వేలు, లైఫ్‌ సభ్యత్వం రూ.1,000, సంస్థాగత సభ్యత్వం సంవత్సరానికి రూ. 5వేలు ఉంటుందన్నారు. రెడ్‌క్రాస్‌కు ఇచ్చే విరాళాలకు 80జీ కింద పన్ను మినహాయింపు ఉంటుందన్నా రు. ఈ మానవతా సేవలో భాగంగా ప్రజలు విరా ళాలు ఇవ్వడం, సభ్యత్వం పొందడం లేదా స్వచ్ఛంద సేవలకులుగా పాల్గొనవచ్చని తెలిపారు.

సేవాభావాన్ని అలవర్చుకోవాలి

బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన తర్వాత సేవాభావం, సహానుభూతి, మానత్వంతో కూడిన సేవలను ప్రజలకు అందించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన నర్సింగ్‌ కాలేజీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. నర్సింగ్‌ కాలజీ మొదటి బ్యాచ్‌కు చెందిన 87 మంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. అందరూ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ హనుమంతమ్మ, వైస్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మీదేవి, ఏఓ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement