● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
● ఇప్పటి వరకు 435 అర్జీల పెండింగ్‌పై ఆగ్రహం
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 56 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్జ్‌మెంట్ పంపాలన్నారు. ప్రజావాణికి సంబంధించి ఇప్పటి వరకు 435 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులో రెవెన్యూ శాఖ పరిధిలోనే అధికంగా ఉన్నాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల్లో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే.. చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. కాగా, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ చాలా మంది అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వారంలోగా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా అధికారులు సమయపాలన కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాలు, ఆస్పత్రుల్లో ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు ఎంపీడీఓలు తరచుగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులతో పాటు భోజనం చేయాలని.. పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి బుధవారం ఉదయం 11గంటలకు వారి గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.


