ఇటిక్యాల: పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప, శాస్త్రవేత్త అర్చన రైతులకు సూచించారు. సోమవారం ఎర్రవల్లి మండలం పుటాన్‌దొడ్డి రైతువేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో శాస్రవేత్తలతో రైతుల ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పంటల సాగులో పాటించాల్సిన మెళకువలపై సూచనలు చేశారు. యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులుగా మొక్కజొన్న, పప్పుదినుసుల పంటలు వేసుకోవాలని సూచించారు. ఎప్పుడే ఒకేరకం పంటసాగు, విచక్షణరహితంగా ఎరువుల వినియోగంతో పంటపొలం నిస్సారంగా మారుతుందన్నారు. అదే విధంగా పెట్టుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతులు పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ సక్రియా నాయక్, ఏఓ సురేశ్, సర్పంచ్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ పాల్గొన్నారు.


